అనంతపురం- నేటి సమాజంలో ఎప్పుడు, ఎవరి చేతిలో మోసపోతామో తెలియడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎవరో ఒకరు ఎవరినో ఒకరిని మోసం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా కేటుగాళ్లు మాత్రం కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇక చిట్టీల పేరుతో చేస్తున్న మోసాలు మరి ఎక్కువయ్యాయి. కొన్నాళ్లు నమ్మకంగా చిట్టీలు వేసి, ఆ తరువాత పెద్ద మొత్తంతో చెక్కేస్తున్నారు.
అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ కిలాడీ లేడీ ఇలాగే జనాలను బురిడీ కొట్టించింది. సత్యానారాయణపేటలో విజయలక్ష్మి అనే మహిళ, ఆమె కొడుకు అశోక్ వైపీఏ గ్రూప్ ఫండ్స్ పేరుతో చిట్టీల వ్యాపారాన్ని ప్రారంభించారు. 20 సంవత్సరాలుగా చిట్టీలు వేస్తుండటంతో చాలా మంది వారిదగ్గర చిట్టీలు వేశారు. ఐతే జనం మత దగ్గర చిట్టీలు వేసిన డబ్బులను విజయలక్ష్మి, ఆమె కొడుకు తమ సొంతానికి వాడుకోవడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో జనం చిట్టీల డబ్బులు సరిగా ఇవ్వకపోవడంతో కాస్త ఒత్తిడి పెంచారు. ఇంకేముంది విజయలక్ష్మి, ఆమె కొడుకు అశోక్ తో కలిసి జెండా ఎత్తేసింది. బాధితులు ఆమె ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. వారం రోజులైనా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి వారికి ఫోన్ చేయగా స్పందన లేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.
విజయలక్ష్మి, అశోక్ లు దాదాపు 1600 మందికి 45 కోట్ల రూపాయలు టోకరా వేసినట్లు పోలీసులు లెక్కతేల్చారు. చాలా మంది బాధితులు తమ పిల్లల చదువులకు, కుటుంబ పోషణకు, పెళ్లిళ్ల కోసమని విజయలక్ష్మి వదగ్గర చిట్టీలు వేయగా, ఆమె మోసం చేసి పారిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు ఎప్పటిలాగే పారిపోయిన వారిని పట్టుకుంటామని చెబుతున్నారు.