ఖమ్మం- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పదవ తరగతి విద్యార్ధి చేయకూడని విన్నపం చేశాడు. తనకు బ్రతకాలని లేదని, చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను కోరాడు. ఈ మేరకు మీడియా ద్వార టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేయడం కలకలం రేపుతోంది. తన అక్క, బావ మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని, వారి వేధింపులు తట్టుకోవడం కంటే చావే నయం అనిపిస్తోందని వాపోయాడు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన గోరంట్ల లక్ష్మీనారాయణ అదే మండలంలోని బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేసేవాడు. ఆయనకు భార్య సుజాత, ఓ కుమార్తె, కుమారుడు సాయి ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఆయన అనారోగ్యంతో చనిపోవడంతో భార్య సుజాతకు స్కీల్ లో అటెండర్‌గా ఉద్యోగం ఇచ్చారు. అమ్మాయికి పెళ్లి చేయగా, అబ్బాయి ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు.
ఈ క్రమంలో గత సంవత్సరం సుజాత కూడా అనారోగ్యంతో మరణించడంతో సాయి హుజుర్ నగర్ లోని అక్క ఇంట్లోనే ఉంటూ చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు లేని తమ్ముడిని అమ్మలా చూసుకోవాల్సిన అక్క, భర్తతో కలిసి బాలుడిపై వేధింపులకు పాల్పడుతోంది. తల్లి మరణంతో కారుణ్య నియామకం ద్వార వచ్చే ఉద్యోగంతో పాటు, ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అన్నీ తనకే కావాలని భర్తతో కలిసి తమ్ముడి వేధింపులకు గురిచేస్తోంది సొంత అక్క.
అక్కా బావ వేధింపులు ఎక్కువ అవ్వడంతో సాయి హుజూర్ నగర్ నుంచి నేలకొండపల్లికి వచ్చి, ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. అయినా ప్రతి రోజూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేధన వ్యక్తం చేస్తున్నాడు. అక్క వేధింపులతో బ్రతకాలని అనిపించడం లేదని, తనకు ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం లేదని, అందువల్లే ప్రభుత్వం తనకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు మీడియా ద్వారా విన్నవించుకున్నాడు.