తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు గుడ్ న్యూస్ తెలిపారు. నగరంలో నిర్మాణం పూర్తై పంపిణీకి సిద్ధంగా ఉన్న లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నేటి నుంచే పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు.
స్వరాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల కోసం వినూత్న రీతిలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన అనతికాలంలోనే అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటోంది తెలంగాణ. ఏ ఆకాంక్షలమేరకు ఉద్యమించి తెలంగాణను సాధించుకున్నామో వాటిని నెరవేర్చుకునే దిశగా ప్రభుత్వ పాలన కొనసాగుతోంది. కాగా నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజలకు శుభవార్తనందించారు. ఆ వివరాలు మీకోసం..
రాష్ట్రంలో గూడు లేని నిరుపేదలను ఆదుకొని వారికి ఇళ్లు కట్టించాలని సంకల్పించిన ప్రభుత్వం డబుల్ బెడ్రూం పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా పేదలకు నయా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి అందిస్తోంది. కాగా గోల్కొండ కోట వేదికగా జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని నిరుపేదలకు శుభవార్త తెలిపారు. ఈ రోజు నుంచే హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులైన పేదలకు ప్రభుత్వం అందజేస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. సీఎం కేసీఆర్ ప్రకటనతో పేద ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల తమ సొంతింటి కలను నెరవేర్చుతున్న కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.