ప్రపంచం నలుమూలలలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. అవి మన కంటికి కనిపించే వరకు అది వింతని మనకు తెలీదు. ఇక కొన్ని కొన్ని వింతలను చూస్తే.. మనం నోరెళ్ల బెట్టడం ఖాయం. ఇప్పుడు అలాంటి వింత గురించే మాట్లాడుకోబోతున్నాం. సాధారణంగా నేటి మానవుడు నాలుగు అడుగులు వేస్తేనే నీరసించిపోతున్న రోజులివి. ఇక జంతువులు, పక్షుల విషయానికి వస్తే.. తమ శక్తి మేరకు పరిగెత్తడం, ఎగరడం చేస్తుంటాయి. కానీ ఓ పక్షి మాత్రం ఆగకుండా కొన్ని 13 వేల కి.మీ ప్రయాణం చేసి గిన్నిస్ రికార్డ్ బద్దలు కొట్టింది. 11 రోజులు నాన్ స్టాప్ గా ఎగిరి తన గమ్యాన్ని చేరుకుంది. ఈ వండర్ బర్డ్ గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
బార్ టెయిల్ గాడ్విట్.. లిమోసా జాతికి చెందిన అరుదైన పక్షి. ఈ లిమోసా జాతికి చెందిన పక్షులకు ఓ అద్భుతమైన టాలెంట్ పుట్టుకతోనే వస్తుంది. అదేంటంటే ఏకబిగిన ఎగరడం మెుదలు పెడితే ఎన్ని వేల కి.మీ పోతాయో వాటికే తెలీదు. సాధారణంగా పక్షులు కాలాన్ని బట్టి ఆహారం కోసం వలస పోతుంటాయి. ఈ క్రమంలోనే బార్ బేల్డ్ గాడ్విట్ అనే పక్షి కూడా అమెరికాలోని అలస్కా నుంచి బయలుదేరి ఆస్ట్రేలియాలోని టాస్మేనియా వరకు ఆగకుండా ప్రయాణించింది. కనీసం ఆహారం కోసం కూడా ఈ బుల్లి పిట్ట ఎక్కడా ఆగలేదు. అక్టోబర్ 13 న బయలుదేరిన పక్షి అక్టోబర్ 24 వరకు నాన్ స్టాప్ గా ప్రయాణించింది. ఏకబిగిన 11 రోజులు ఆగకుండా 13,560 కి.మీ ప్రయాణం చేసి టాస్మేనియాలోని ఆన్ సాన్స్ తీరానికి చేరుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
సాధారణంగా పక్షుల గురించి అధ్యాయనం చేసే శాస్త్రవేత్తలు ఈ విధమైన ప్రయోగాలు చేస్తుంటారు. అందులో భాగంగానే గాడ్విన్ పక్షి, మరి కొన్ని పక్షులకు బయలుదేరే ముందు వాటికి జీపీఎస్ ట్రాకర్ ను అమర్చారు. ఆ ట్రాకర్ ద్వారా పక్షి ఎంత దూరం ప్రయాణించింది, ఎక్కడ ఆగిందో తెలుసుకోవచ్చు. అయితే ఈ బుల్లి పిట్ట మాత్రం ఎక్కడా ఆగకుండా అన్ని వేల కీలోమీటర్లు ఎలా ప్రయాణించిందో శాస్త్రవేత్తలకు అంతుపట్టడం లేదు. అదీ కాక ఈ పక్షి వయసు కేవలం 5 నెలలు మాత్రమే. దాంతో ఈ పిట్ట సింగిల్ గా వెళ్లిందా? లేదా ఏదైన గుంపుతో వెళ్లిందా? అని శాస్ర్తవేత్తలు అధ్యాయనం చేస్తున్నారు. ఇక ఈ పిట్ట ఇంత దూరం ఆగకుండా ప్రయాణం చేయడంతో సగం బరువును కోల్పొయి ఉంటుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే ఇదే జాతికి చెందిన పక్షి 2020లో అలెస్కా నుంచి న్యూజిలాండ్ వరకు దాదాపు 12 వేల కి. మీ ప్రయాణం చేసి రికార్డ్ సాధించింది. తాజాగా ఈ రికార్డ్ ను గాడ్విట్ బద్దలు కొట్టింది. దాంతో వండర్ బర్డ్ గా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.