ఎవరికైనా సొంతగా ఓ ఇల్లు లేదా ఖరీదైన విల్లాను కొనుక్కోవాలని కోరిక ఉంటుంది. అందుకోసం లక్షల రూపాయలు ఖర్చుపెట్టైనా తమ కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఎవరైన గ్రామాన్నే కొనాలని అనుకుంటారా? మీకు ఏమైనా పిచ్చా? ఇళ్లు, విల్లాలు తీసుకోవాలనే వారు ఉంటారు.. కానీ ఊరుని కొనేవాళ్లు ఉంటారా? అని మీకు సందేహం రావచ్చు. అయితే పుర్రెకో బుద్ధి.. జిహ్వ కో రుచి అన్నట్లు.. ఆ కోరిక ఉండే వాళ్లు కూడా ఉండొచ్చు. అలా గ్రామానికి సొంతం చేసుకునే కోరిక ఉన్నవాళ్లకు ఓ శుభవార్త. మీ దగ్గర కేవలం రూ. 2 కోట్లు ఉంటే చాలు ఓ గ్రామం మీ సొంతం అవుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న.. ఇది నిజం. అయితే ఈ గ్రామం ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు. యూరప్ ఖండంలోని స్పెయిన్ దేశంలో ఈ గ్రామం ఉంది. మరి.. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
స్పెయిన్ లోని సాల్టో డే కాస్ట్రో అనే గ్రామం ఉంది. ఇది పోర్చుగల్ దేశానికి సరిహద్దులో ఉంది. ఈ గ్రామానికి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నుంచి మూడు గంటల్లో చేరుకొవచ్చు. 1950 సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఓ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. ఆ సమయంలో సమీపంలోని కొండ ప్రాంతంలో ప్రాజెక్ట్ లో పనిచేసే వారు నివాసాలు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ప్రాజెక్ట్ పని పూర్తైన తరువాత..అక్కడ పనులు లేకపోవడంతే ఒక్కొక్కరుగా బయట ప్రాంతానికి వెళ్లడం ప్రారంభించారు. అలా 1990 నాటికి ఆ ఊరు మొత్తం ఖాళీ అయ్యింది. సాల్టో డే కాస్ట్రో గ్రామంలో మొత్తం 44 ఇళ్లు ఉన్నాయి. వాటితో పాటు ఓ హోటల్, చర్చి, పాఠశాల, స్విమ్మింగ్ పూల్ వంటి ఉన్నాయి. అంతేకాక మరికొన్ని ఇతర సదుపాయాలు సైతం ఆ గ్రామంలో ఉన్నాయి.
కొండ ప్రాంతంలో ఉండటం వలన ఆ గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఓ కుటుంబం భావించింది. ఆ ఉద్దేశంతో 2000 సంవత్సరంలో ఆ గ్రామాన్ని సదరు కుటుంబం కొనుగోలు చేసింది. కానీ ఆర్ధిక సమస్య కారణంగా వారి ఉద్దేశం విజయవంతం కాలేదు. దీంతో ఆ గ్రామాన్ని విక్రయించాలనే ఆ కుటుంబం నిర్ణయించుకుంది. స్పెయిన్ లోని ఓ ప్రముఖ కంపెనీ వెబ్ సైట్లో తమ గ్రామ వివరాలను పొందుపరిచారు. తాను పట్టణంలో ఉంటున్న కారణంగా ఆ గ్రామాన్ని అమ్ముతున్నట్లు ఆ ఊరి యజమాని వివరించారు. నవంబర్ మొదటి వారంలో ఆ ప్రకటన ఇవ్వగా భారీ స్పందన వస్తున్నట్లు స్థానిక మీడియాలు వెల్లడించాయి. ఇప్పటికే దాదాపు 50 వేల మంది ఆ గ్రామానికి సంబంధించిన వివరాలు చూశారు. రష్యా, ఫ్రాన్స్, బెల్జియంతో పాటు యూకే కు చెందిన 300 మంది ఆ గ్రామాన్ని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు విక్రయానికి ఉంచిన సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
ఆ గ్రామం ఖరీదు ఎంతంటే.. 2,27,000 యూరోలు మాత్రమే… మన కరెన్సీలో సుమారు రూ.2 కోట్లు అన్నమాట. అంటే మీ వద్ద రెండు కోట్లు ఉంటే ఆ గ్రామాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. అయితే పూర్తి సమాచారం కోసం సదరు వెబ్ సైట్ ను చూడండి. అయితే గతంలోనూ ఈ గ్రామాన్ని యజమాని అమ్మకానికి పెట్టినప్పటికీ ఎవరు ముందుకు రాలేదు. కారణం.. ఆ సమయంలో భారీ స్పందన వస్తుందనే ఉద్దేశంతో ఎక్కువ ధర నిర్ణయించాడు. దీంతో ఎవరూ ముందుకు రాలేదు. ఈసారి మాత్రం మార్కెట్ విలువ అంచనా వేసి ధర నిర్ణయించాడు. దీంతో ఈ గ్రామాన్ని సొంతం చేసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.