భారతీయ మూలాలు ఉన్న తెలుగు యువకుడు సాయి వర్షిత్ పేరు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అతడు ఏకంగా అమెరికా అధ్యక్షుడ్ని చంపాలనుకోవటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చంపటానికి ప్రయత్నించిన కేసులో భారతీయ మూలాలు ఉన్న యువకుడు సాయి వర్షిత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సాయి వర్షిత్ సోమవారం రాత్రి 9:40 సమయంలో ఓ ట్రక్‌తో లాఫాయెట్ పార్క్‌కు సమీపంలో ఉన్న హెచ్ స్ట్రీట్ 1600 బ్లాక్‌లోని బోలార్డ్‌లపై దూసుకెళ్లాడు. అక్కడ ఉన్న బారికేడ్స్‌ను ట్రక్‌తో ఢీ కొట్టి వైట్‌హౌస్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే, అతడి ప్రయత్నం విఫలం అయింది. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి హుటాహుటిన జైలుకు తరలించారు. ఎందుకు వైట్ హౌస్‌పైకి దాడికి దిగాడన్న వివరాలు సేకరిస్తున్నారు.
సాయి వర్షిత్ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ను చంపటానికి కుట్ర రచించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతేకాదు! జోబైడెన్ లేదా.. వైస్ ప్రెసిడెంట్‌ను కానీ, వారి కుటుంబ సభ్యులను కానీ చంపేందుకు కుట్ర చేసినట్లు వెల్లడైంది. ఈ దాడికి ఆరు నెలలుగా ప్లాన్ చేసినట్టు సాయి వర్షిత్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు సాయి వర్షిత్‌ను అరెస్టు చేసిన సమయంలో దాడికి పాల్పడ్డ ట్రక్‌లో నాజీ జెండాను గుర్తించారు. అతడు నాజీల కోసం పని చేస్తున్న వాడై ఉండాలని పోలీసులు భావిస్తున్నారు.
సాయి వర్షిత్ పూర్తి పేరు కందుల సాయి వర్షిత్. ఇతడి వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. ఇతడిది భారతీయ మూలాలు ఉన్న తెలుగు కుటుంబం. అతడు మిస్సౌరీలోని చెస్టర్‌ఫీల్డ్ ప్రాంతానికి చెందిన వాడు. ఇప్పుడు అతడి పేరు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అతడు ఎందుకు జోబైడెన్‌ను చంపాలనుకున్నాడో సరైన కారణాలు మాత్రం తెలియరావటం లేదు. పోలీసులు ఈ విషయాలనే విచారిస్తున్నారు. మరి, జోబైడెన్‌ను చంపటానికి కుట్ర చేసిన సాయి వర్షిత్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.