ఇరువురు భామల కౌగిలిలో.. ఇరుకునపడి నీవు నలిగితివా అంటే పాటను వినే ఉంటారు. ఇద్దరు భామల నడుమ ప్రియుడు పడే ఇబ్బందులను కవులు ఈ విధంగా చెబుతుంటారు. అయితే ఓ అమెరికన్ మాత్రం ముగ్గురు భార్యలతోనూ దర్జాగా నెట్టుకొస్తున్నాడు.
మన దేశంలో ఒకరినే జీవిత భాగస్వామిగా చేసుకోవచ్చు. బహుభార్యత్వానికి భారత చట్టాలు ఒప్పుకోవు. కానీ కొన్ని దేశాల్లో ఈ కల్చర్ అమల్లో ఉంది. ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాల్లో దీన్ని ఎక్కువగా చూడొచ్చు. అక్కడి కొన్ని తెగల్లో బహుభార్యత్వం సర్వసాధారణమనే చెప్పాలి. ఒకరికి మించి భార్యలు, డజన్ల కొద్దీ పిల్లల్ని కనడం అక్కడ కామనే. అయితే పేదరికం, ఉపాధి లేమి లాంటి కారణాల వల్ల ఇలాంటి కుటుంబాలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అయినా బహుభార్యత్వాన్ని మాత్రం వదలడం లేదు. అమెరికాలోని ఓ వ్యక్తి కూడా ఇలాగే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇరువురు భామల మధ్య నలగడమే కష్టం అనుకుంటే మనోడు ఏకంగా ముగ్గురు రమణులతో దర్జాగా నెట్టుకొస్తున్నాడు.
యూఎస్‌కు చెందిన ఆ వ్యక్తి పేరు నిక్ డెవిస్. అతడి ముగ్గురు భార్యలూ జాబ్స్ చేస్తూ నిక్‌ను పోషిస్తున్నండటం గమనార్హం. తనను తాను చెస్ గేమ్‌లో రాజుతో పోల్చుకునే నిక్.. ‘కింగ్ ఎక్కడైనా కష్టపడతాడా’ అని ఎదురు ప్రశ్నిస్తాడు. తన ముగ్గురు భార్యలను ఉద్యోగాలకు పంపి ఇంట్లో హాయిగా ఉంటున్నాడు. పదిహేనేళ్ల కింద మొదటి భార్య ఏప్రిల్ (38) నిక్ లైఫ్‌లోకి వచ్చింది. తొమ్మిదేళ్ల కింద.. ఏప్రిల్ అంగీకారంతో జెన్నీఫర్ (34)ను వివాహం చేసుకున్నాడు. మరోసారి ప్రేమలో పడిన నిక్.. ముచ్చటగా మూడోసారి ఇద్దరు భార్యల సమక్షంలో డానియేల్ (22)ను పెళ్లి చేసుకున్నాడు. ఈ ముగ్గురూ ఒకే ఇంట్లో కలుపుగోలుగా, ఎలాంటి గొడవలు లేకుండా హాయిగా కాపురాలు చేసుకోవడం విశేషం. నిక్కు ఇప్పటికే ఓ కుమారుడు ఉండగా.. గతేడాది జూన్‌లో మరో చిన్నారి పుట్టింది.