సాధారణంగా ఇంటి అలంకరణ కోసం పెట్టిన వాల్ పేపర్స్.. మనిషి ప్రాణాలు తీయడం గురించి ఎప్పుడైనా విన్నారా.. లేదా.. పోని మనుషల ప్రాణాలు తీసే పుస్తకం గురించైనా విన్నారా.. అబ్బే ఇప్పటి వరకు అలాంటి ఓ పుస్తకం ఉందని కూడా మాకు తెలియదు అంటారా.. అయితే ఈ వింత పుస్తకం గురించి ఇప్పుడు తప్పక తెలుసుకోవాల్సింది. ఆ పుస్తకం పేరు ‘షాడోస్ ఫ్రమ్ ది వాల్స్ ఆఫ్ డెత్’. ఈ పుస్తకంలో 100 కు పైగా పేజీలు ఉంటాయి. వీటన్నింటిని తిరగేస్తే.. మీరు కచ్చితంగా చనిపోతారు. ఈ విషయాన్ని పుస్తకం మొదటి పేజీలోనే తెలిపాడు రచయిత. ఈ పుస్తకాన్ని కూడా పేపర్లతో కాకుండా.. వాల్ పేపర్స్ తో తయారు చేశాడు. మధ్యలో ఈ వాల్ పేపర్స్ ఎందుకు వచ్చాయి అంటే.. 18వ శతబ్దానికి వెళ్లాల్సిందే.
1860 కాలంలో అమెరికా ప్రజలు ఇంట్లో అలంకరణ కోసం వాల్ పేపర్స్ ని బాగా వాడేవారు. అయితే వీటిని ఆర్సెనిక్ అనే రసాయనంతో తయారు చేసేవారు. ఇది ఎంతో ప్రమాదకరమైన మూలకం. ఇది ఎక్కువ మొత్తంలో మనిషి శరీరంలోకి వెళ్తే ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువ. అయితే ఈ విషయం తెలియక జనాలు ఆర్సెనిక్ తో తయారయిన వాల్ పేపర్స్ ని ఇంట్లో ఉంచేవారు. ఇది గాలి ద్వారా, వాల్ పేపర్ ని తాకడం ద్వారా.. శరీరంలోకి వెళ్లి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. అయితే తొలుత ఈ విషయాన్ని అమెరికా రసాయన శాస్త్రవేత్త , ప్రొఫెసర్ డాక్టర్ రాబర్ట్ ఎం. కెడ్జె గుర్తించారు. దీని గురించి జనాలకు అవగాహన కల్పించాలని భావించారు. అయితే ఊరికే చెప్పడం వల్ల ఎవరు వినరు.. విన్నా.. నమ్మరు అని భావించిన కెడ్జె ఓ వినూత్న ప్రయోగం చేశాడు.
ఆర్సెనిక్ తో తయారయిన వాల్ పేపర్స్ ని సేకరించి.. వాటితో 100కు పైగా పేజీలున్న ఓ పుస్తకాన్ని తయారు చేశాడు. దానికి షాడోస్ ఫ్రమ్ ది వాల్స్ ఆఫ్ డెత్ పేరు పెట్టాడు. ఆర్సెనిక్ వల్ల ఎలాంటి ముప్పు ఉందో.. ఈ పుస్తకంలో వివరంగా రాసుకొచ్చాడు. పుస్తకం మొదటి పేజీలోనే.. దీనిలోని వాల్ పేపర్స్ కు ఆర్సెనిక్ ఉందని.. పేజీలు తిరగేసే సమయంలో అది మనిషి శరీరంలోకి వెళ్లి తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుందని.. ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందని తెలిపాడు. ఈ పుస్తకాన్ని చిన్నారులకు దూరంగా ఉంచాలని సూచించాడు.
ఈ పుస్తకాన్ని 100 కాపీలు తీసి.. మిచిగాన్ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గ్రంథాలయాలకు పంపించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు కెడ్జె చెప్పిన విషయం నిజమేనని అందరికీ తెలిసింది. దాంతో గ్రంథాలయ నిర్వాహకులు.. ఆ పుస్తకాలను నాశనం చేశారు. ప్రస్తుతం ఈ పుస్తకం నాలుగు కాపీలు మాత్రమే ఉన్నాయి. అంతేకాక దీన్ని డిజిటల్ రూపంలోకి మార్చి.. ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.