రోజుకు సగటున ఎవరైనా 8 గంటలు పడుకుంటారు. మహా అయితే మరో రెండు, మూడు గంటలు ఎక్కువగా నిద్రిస్తారేమో. ఎక్కువసేపు పడుకుంటే తర్వాతి రోజు నిద్రపట్టదు, ఒళ్లునొప్పులు కూడా వచ్చేస్తాయి. కానీ ఓ మహిళ రోజుకు 22 గంటలు నిద్రపోతోంది. ఒక్క రోజు కాదు.. కొన్నేళ్ల నుంచి ఇలాగే ఎక్కువసేపు నిద్రిస్తోంది. ఆమె కథ ఏంటంటే..?
జీవితంలో నిద్ర ఓ భాగం. తినడం, పని చేయడం ఎలాంటిదో నిద్ర కూడా అలాంటిదే. రోజుకు 8 గంటలు పడుకుంటే చాలని, ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే కొందరు మాత్రం నిద్రే జీవితంగా బతుకుతుంటారు. రోజులో ఎంతసేపు వీలు కుదిరితే అంత సేపు పడుకుంటారు. కాస్త ఖాళీ దొరికినా కుంభకర్ణుడిలా నిద్రకు ఉపక్రమిస్తారు. తినడం, నిద్రపోవడమే తమ పని అని భావించే మహానుభావులూ ఉన్నారు. అతినిద్ర మంచిది కాదని హెల్త్ ఎక్స్పర్ట్స్ ఎంత మొత్తుకున్నా పట్టించుకోరు. గంటలు గంటలు బెడ్ మీదే గడుపుతుంటారు. అలాంటివారు కొత్త కొత్త ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకోవడం గురించి వార్తల్లో చూస్తున్నాం.
ఇంగ్లండ్‌కు చెందిన ఓ మహిళ ఇలాగే అతిగా నిద్రపోతోంది. ఎంతగా అంటే.. రోజుకు 22 గంటలు పడుకుంటోంది. నిద్ర తప్ప వేరే ధ్యాసే లేనంతగా ఉన్న ఆమె పేరు జొనా కాక్స్ (38). అయితే ఆమె కావాలని నిద్రపోవడం లేదు. ఇడియోపాథిక్ హైపర్సోమ్నియా అనే అరుదైన వ్యాధే దీనికి కారణం. ఈ వ్యాధితో బాధపడుతున్న జొనా పగటిపూట మేల్కొని ఉండేందుకు నానా తంటా పడుతోంది. నిద్రలేవడం కష్టంగా అనిపిస్తూ విశ్రాంతి లేమితో కుంగుబాటుకు గురయ్యే పరిస్థితితో సతమతమవుతోంది. 2017లో పగలంతా విపరీతమైన అలసటకు గురవ్వడంతో ఆమెకు ఈ విచిత్రమైన లక్షణాలు ఎదురయ్యాయట.
క్లబ్బులు, కార్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ నిద్రకు ఉపక్రమించే జొనాను రియల్ స్లీపింగ్ బ్యూటీగా పిలుస్తున్నారు. అతినిద్రతో ఆమె 2019లో ఉద్యోగాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత 2021లో అక్టోబర్‌లో జొనాను యార్క్‌షైర్‌లోని స్లీప్ క్లినిక్‌కు తీసుకెళ్లారు. ఆమెను పరిశీలించిన వైద్యులు స్లీప్ డిజార్డర్ వల్లే బాధపడుతున్నట్లు తేల్చారు. ఇక అప్పటి నుంచి ఏటికేడు ఆమె ఆరోగ్య పరిస్థితి దిగజారుతోంది. నిద్ర లేవాలని అనిపిస్తే బెడ్ మీదకు వందలాది సాలీడ్లు వచ్చి అటాక్ చేసినట్లు ఆమెకు అనిపించేదట. ఎన్ని మందులు వాడినా, థెరపీలు చేయించుకున్నా పరిస్థితిలో మార్పు లేదంటోంది. తనకు వ్యాధిని నయం చేసే డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నానని అంటోంది జొనా. మరి.. ఈ స్లీపింగ్ బ్యూటీ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.