ఒక్కోసారి కొంతమంది బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడుతుంటాయి. పొరపాటున వేలు, లక్షలు పడుతుంటాయి. బాధ్యత గల పౌరులు బ్యాంకు వారిని సంప్రదించి.. ‘అయ్యయ్యో వద్దండి, పరుల సొమ్ము మాకెందుకు’ అని వెనక్కి ఇచ్చేస్తారు. కొంతమంది ఉంటారండోయ్.. వాళ్ళు మాత్రం తేరగా వస్తే క్షణాల్లో డబ్బు మాయం చేసేస్తారు. బ్యాంకుకి తెలిసేలోపు వేరే ఖాతాల్లోకి బదిలీ చేసేసుకుంటారు. లేదంటే ఏటీఎంకి పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ డ్రా చేసేసుకుంటారు. ఏదో సొంత కష్టార్జీతం అన్నట్టే ఫీలైపోతుంటారు. బ్యాంకు వాళ్ళు కాల్ చేస్తే.. ‘దట్స్ యువర్ ప్రాబ్లమ్.. నానేటి సేయగలను’ అని ఏమీ ఎరగని ఎల్లుల్లిపాయల్లా మాట్లాడతారు.
కానీ బ్యాంకు వాళ్ళు ఊరుకుంటారా? కోర్టులో కేసులు పెట్టి నానా రభస చేస్తారు. అయితే డబ్బులు పడినట్టు మనిషికి తెలిసేలోపు బ్యాంకు వారికి తెలిస్తే మాత్రం వెంటనే అకౌంట్ ని హోల్డ్ చేసి, ఏటీఎం కార్డుని బ్లాక్ చేసి పడేస్తారు. నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని బ్లాక్ చేస్తారు. తాజాగా ఒక పోలీస్ ఆఫీసర్ విషయంలో ఇదే జరిగింది. పాకిస్తాన్ లోని కరాచీ నగరానికి చెందిన ఆమిర్ గోపంగ్ అనే పోలీస్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. తెల్లారేసరికి మళ్ళీ మామూలు అయిపోయాడు. గుర్తు తెలియని బ్యాంకు ఖాతా నుంచి ఈ పాకిస్తాన్ పోలీస్ బ్యాంకు ఖాతాలోకి 10 కోట్లు పడ్డాయి. కరాచీలోని బహదురబాద్ పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు.
తన బ్యాంకు ఖాతాలో తన జీతంతో పాటు 10 కోట్లు జమ అయ్యాయి. ఈ విషయాన్ని బ్యాంకు వారే చెప్పారని అతను వెల్లడించాడు. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదని, తన బ్యాంకు ఖాతాలో వేల రూపాయల కంటే ఎక్కువ డబ్బు చూసింది లేదని వెల్లడించాడు. అయితే డబ్బులు పడ్డాయన్న ఆనందాన్ని బ్యాంకు వాళ్ళు ఎంతోసేపు ఉండనివ్వలేదు. ఎక్కడ ఈ పోలీసోడు డబ్బులు విత్ డ్రా చేసినా చేస్తాడో అని బ్యాంకోళ్లు అకౌంట్ ని ఫ్రీజ్ చేసి పడేశారు. ‘మీ బ్యాంకు వాళ్ళు ఉన్నారే, ఫ్రీగా వచ్చిన డబ్బుని కూడా ఫ్రీజ్ చేస్తారు. మా కష్టాలని అర్ధం చేసుకోరు’ అనేలా పాఫం ఆ పోలీస్ అతన్ని బాధపెట్టారు ఈ బ్యాంకోళ్లు. 10 కోట్లు పడ్డాయని ఎప్పుడైతే బ్యాంకోళ్లు చెప్పారో.. అప్పుడు పోలీస్ మోహంలో ఒక స్పార్క్ వచ్చింది. ఎప్పుడైతే బ్యాంకోళ్లు పోలీస్ అతని ఖాతాని ఫ్రీజ్ చేసి.. ఏటీఎం కార్డుని బ్లాక్ చేశారో అప్పుడే అతనికి ఫ్యూజ్ కొట్టేసింది.
అయితే ఆ పోలీస్ అకౌంట్ లో డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే పాకిస్తాన్ లోని లార్కనా, సుక్కూర్ నగరాల్లో చోటు చేసుకున్నాయి. పలు పోలీస్ ఆఫీసర్ల ఖాతాల్లో ఎక్కువ మొత్తం డబ్బు వచ్చి పడింది. లార్కనా నగరంలో ఒక్కో అధికారికి 5 కోట్ల చొప్పున ముగ్గురు అధికారుల ఖాతాల్లో పడ్డట్టు తెలిపారు. అలానే సుక్కూర్ లో ఒక పోలీస్ అధికారి ఖాతాలో 5 కోట్లు పడ్డట్లు తెలిపాడు. అయితే ఇంత మొత్తం వారి ఖాతాల్లో ఎలా పడిందో అనే విషయం తమకు తెలియదని సదరు పోలీస్ అధికారులు వెల్లడిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ల ఖాతాల్లోనే అన్ని కోట్లు పడుతుండంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.