ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లింది. కన్నవారికి, పుట్టిన ఊరిని వదిలి జీవితంలో ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టింది. ఉద్యోగంలో చేరి తల్లికి అండగా నిలవాలనుకుంది. కానీ ఆమెను విధి బలితీసుకుంది. గత నెల 23న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా ఆదోని వాసి కందుల జాహ్నవి ప్రాణాలు విడిచింది. రక్షించాల్సిన పోలీసే ఆమె పాలిట భక్షకుడయ్యాడు. సియోటెల్ లో నివసిస్తున్న ఆ యువతి డెక్స్టర్ అవెన్యూ నార్త్ థామస్ స్ట్రీట్ లో నడుచుకుంటూ వెళ్తుండగా పోలీస్ పెట్రోల్ వాహనం బలంగా ఢీకొట్టింది. అంబులెన్స్ లో ఆమెను ఆసుప్రతికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఎన్నోఉన్నత శిఖరాలను చూడాల్సిన యువతి అర్థంతరంగా తనువు చాలించింది. ఆమె మరణంపై అమెరికా ఎన్ఆర్ఐలతో సహా అక్కడి ప్రజలు సైతం సంతాపం ప్రకటించారు. కొవ్వొత్తులు ప్రదర్శన, సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అంతేకాకుండా బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఆ కుటుంబం కోసం ఆన్ లైన్ నిధుల సేకరణ ఏర్పాటు చేశారు. గోఫండ్ మీ (GoFundMe) వెబ్‌సైట్ ద్వారా ఫండ్ రైజింగ్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా డబ్బును సమీకరించారు. అయితే నిధుల సమీకరణ లక్ష్యం 125,000 డాలర్లు లేదా దాదాపు రూ.1 కోటి అని అనుకున్నప్పటికీ.. ఊహించని విధంగా అంతకన్నా ఎక్కువ డబ్బును సమీకరించారు.
ఐదు రోజుల్లో దాదాపు రూ.1.3 కోట్లు (159,029 డాలర్లు) సమీకరించారు. దాదాపు 4,700 విరాళాలు అందాయి. కాగా, ఆ డబ్బును ఆమె తల్లి విజయలక్ష్మికి అందజేశారు. ఆమె టీచర్ గా పనిచేస్తున్నారు. యువతికి సింగిల్ పేరెంట్. టీచర్ తమ పిల్లల చదువుల నిమిత్తం ఎడ్యుకేషన్ లోన్ తో పాటు కొన్ని అప్పులు చేశారు. ఈ సమీకరించిన నగదును ఆమె వాటికి వినియోగించనున్నారు. జాహ్నవికి ఓ సోదరి కూడా ఉన్నారు. 2021లో అమెరికా వెళ్లింది జాహ్నవి. మరో నాలుగు నెలల్లో చదువు పూర్తయి.. ఉద్యోగంలో చేరి, తల్లికి ఆసరాగా నిలవాలనుకుంది. కానీ అంతలోనే అమెరికా రోడ్డు ప్రమాదం ఆమెను బలితీసుకుంది.