అడవిలో చిన్న ఇల్లు కట్టుకుని ఒక వ్యక్తి ఏకాంతంగా జీవిస్తున్నాడు. సమాజంతో సంబంధం లేకుండా కరెంటు, గ్యాస్ లాంటి సౌకర్యాలు లేకుండానే.. దాదాపు 40 ఏళ్లుగా ప్రకృతితో మమేకమై జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలో ఒకసారి ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చింది. సాయం చేసేందుకు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. అదృష్టవశాత్తు అతని వద్ద ఉన్న జీపీఆర్‌ఎస్ ద్వారా అత్యవసర సహాయక కేంద్రానికి సమాచారం అందడంతో వారు హెలికాప్టర్‌లో అక్కడి చేరుకుని అతన్ని ఆస్పత్రికి తరలించారు.
అతను కోలుకోవడానికి ఏడు వారాలు పట్టింది. ఇలాంటి పరిస్థితి మళ్లీ వస్తే ఇబ్బంది పడతారని అందుకోసం జనావాసంలో ఉండమని వైద్యులు ఆ వ్యక్తికి సూచించారు. కానీ అతను వినలేదు.. తనకు అడవిలోనే హాయిగా ఉంటుందని మళ్లీ అడవి బాట పట్టాడు. ఇంతకీ ఆ వ్యక్తి 40 ఏళ్లుగా అడవిలో ఎందుకు జీవిస్తున్నాడు? సమాజానికి దూరంగా ఉండేలా అతన్ని ప్రభావితం చేసిన అంశాల గురించి తెలుసుకుందాం..
‘అందరూ మనల్ని దూరం పెడితే అది ఒంటరితనం.. అందర్ని మనం దూరం పెడితే అది ఏకాంతం’ ఇలాంటి ఏకాంతాన్నే కోరుకున్నాడు కెన్. బ్రిటన్‌లోని డెర్బీషైర్‌కు చెందిన కెన్ తన 15వ ఏట నుంచే జీవన పోరాటం మొదలుపెట్టాడు. బతకడానికి తల్లిదండ్రులతో కలిసి చిన్నచిన్న పనులు చేసేవాడు. 26 ఏళ్ల వయసులో కెన్‌పై దొంగలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో కెన్ కోమాలోకి వెళ్లిపోయాడు. ఇక అతను బతకడం కష్టం అని వైద్యులు భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ కెన్ స్పృహలోకి వచ్చి కోలుకున్నాడు. కానీ అతను కోమాలో ఉన్న సమయంలో అతని తల్లిదండ్రులు మరణించడంతో కెన్ గుండె ముక్కలైంది. తల్లిదండ్రులు లేరనే బాధతో తీవ్ర మానసిన వ్యథతో కుంగిపోయిన కెన్ సమాజంపై విరక్తి చెందాడు.
సమాజానికి దూరంగా బతకాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియకుండానే దాదాపు 2 వేల మైళ్లు నడిచి స్కాట్లాండ్‌లోని ‘లోచ్’ అనే అటవీ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడే కలపతో ఒక చిన్న ఇల్లు నిర్మించుకున్నాడు. చేపలు పట్టుకుని తింటూ జీవిస్తున్నాడు. ఇలా ఏ చింతా లేకుండా జీవిస్తున్న కెన్‌కు గుండెపోటు వచ్చింది. పైన చెప్పుకున్నట్లు కెన్‌కు చికిత్స అందింది. వైద్యులు అడవిలో వద్దు.. జనావాసాల్లో ఉండాలని చెప్పినా.. మళ్లీ యథావిధిగా ప్రకృతితో మమేకమై కెన్ జీవితం కొనసాగిస్తున్నాడు. మరి కెన్ ఏకాంత జీవితం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.