వారిద్దరూ అన్నదమ్ములు. ఇప్పుడు 90 ఏళ్లకు దగ్గర పడ్డారు. అయితే ఇన్నేళ్ళలో సోదరుడు ఉన్నాడన్న విషయం ఇద్దరికీ తెలియదు. పెద్దోడికి 87, చిన్నోడికి 85 ఏళ్ళు వచ్చాక తమకొక తోబుట్టువు ఉన్నాడన్న విషయం తెలిసింది.
ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే చిన్నప్పుడు జాతరలో ఒకడు తప్పిపోవడం అనేది సినిమాల్లో చూశాం. అప్పటి నుంచి సోదరుడిని ఇంకో సోదరుడు వెతుకుతా ఉంటాడు. ఇంట్లో వాళ్ళు నీకు ఎవరూ లేరు అని చెప్పి పెంచితే ఇక తమ్ముడో, అన్నో ఉన్నాడన్న విషయం ఎలా తెలుస్తుంది. సరిగ్గా అలానే ఇద్దరు అన్నదమ్ములు తమకు ఒక సోదరుడు ఉన్నాడన్న విషయం తెలియకుండా 80 ఏళ్లకు పైనే బతికేశారు. పెన్షన్ తీసుకునే వయసులో అన్నయ్యా.. తమ్ముడూ.. అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. ఇద్దరూ ఉండేది వేర్వేరు దేశాల్లో. వీరిద్దరూ ఎలా కలుసుకున్నారు? ఒకరొకొకరు తమ ఉనికి గురించి ఎలా తెలుసుకున్నారు? సినిమాని తలపించేలా ఉన్న ఈ రియల్ స్టోరీ ఏంటి?
ఈ కథ అలెన్ స్విన్ బ్యాంక్ (87), జాన్ రాబ్సన్ (85) లది. ఒక మహిళ నుంచి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా తనకొక తమ్ముడు ఉన్నాడన్న విషయాన్ని అలెన్ స్విన్ బ్యాంక్ తెలుసుకున్నాడు. మా తాత మీకు బంధువు అని ఒక మహిళ ఫోన్ చేయడంతో.. తనకొక తమ్ముడు ఉన్నాడని అలెన్ రియలైజ్ అయ్యాడు. అలెన్ స్విన్ బ్యాంక్ సవతి తమ్ముడు అంటే అలెన్ తండ్రికి, మరొక మహిళకు పుట్టిన జాన్ రాబ్సన్ ముని మనవరాలు అయిన నటాషా..తన కుటుంబ చరిత్ర గురించి తెలుసుకోవడం కోసం రీసెర్చ్ చేసింది. తన రీసెర్చ్ లో అలెన్ స్విన్ బ్యాంక్ తమ బంధువే అని ఆమె కనుగొన్నది. ఈ క్రమంలో అలెన్ కి కాల్ చేసి విషయాన్ని చెప్పింది. అలెన్ స్విన్ బ్యాంక్, జాన్ రాబ్సన్ ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకే తండ్రికి పుట్టారు. తల్లులు వేరే.
అలెన్ స్విన్ బ్యాంక్ కి 6 నెలల వయసప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. తన తండ్రి నుంచి సెపరేట్ అయ్యాక అలెన్ తన తండ్రితో ఏరోజూ మాట్లాడలేదు. అలెన్ అమ్మ తండ్రిని ద్వేషించడమే అందుకు కారణం. తండ్రితో మాట్లాడనివ్వలేదు. అయితే అలెన్ కి 26 ఏళ్ల వయసప్పుడు తన తండ్రి ఇంటికి వచ్చాడని.. కానీ అప్పుడు తనకొక తమ్ముడు ఉన్నాడన్న సంగతి చెప్పలేదని అలెన్ వెల్లడించాడు. అలెన్ తమ్ముడు జాన్ రాబ్సన్ ఇంగ్లాండ్ లోని బ్రిడ్లింగ్టన్ నగరంలో తాత, ఆంటీల దగ్గర పెరిగాడు. వాళ్ళు తన తమ్ముడితో.. ‘మీ నాయిన యుద్ధంలో చచ్చినాడు అని చెప్పారు. నిజానికి మా నాన్న 68 ఏళ్ల వయసులో 1980లో చనిపోయాడు’ అని అలెన్ అన్నారు. ప్రస్తుతం తమ్ముడు జాన్ రాబ్సన్.. స్కాట్ లాండ్ లో ఉంటున్నాడని అలెన్ అన్నారు.
ఎప్పుడైతే జాన్ ముని మనుమరాలు నటాషా తనకు ఫోన్ చేసిందో.. అప్పుడే తనకో తమ్ముడు ఉన్నాడన్న సంగతి తెలిసిందని అన్నారు. దీంతో ఈ నెలలో ఇంగ్లాండ్ లోని గూలె పట్టణంలో వీరు కలుసుకున్నారు. ఇదొక అద్భుతమైన విషయమని, అమ్మ, నాన్న ఉంటే బాగుండు అని కోరుకుంటూ పెరిగిన వాడినని, నాకో తండ్రి, ఒక అన్న ఉన్నాడని, వీళ్ళ గురించి తెలుసుకోవడం చాలా అద్భుతంగా ఉందని జాన్ రాబ్సన్ అన్నారు. విచిత్రం ఏంటంటే వీరిద్దరూ అచ్చు గుద్దినట్టు తమ తండ్రిలానే ఉన్నారు. మేమిద్దరం తమ తండ్రిలానే ఉన్నామని ఇద్దరూ ఆశ్చర్యపోతున్నారు.
ఈ అపూర్వ సహోదరుల తండ్రి పేరు జాన్ స్పెన్స్ స్విన్ బ్యాంక్. 1980లో 68 ఏళ్ల వయసులో చనిపోయాడు. అలా ఇద్దరు అన్నదమ్ములు ఒకరి ఉనికి ఒకరికి తెలియకుండా పెద్దోడు 87 ఏళ్ళు, చిన్నోడు 85 ఏళ్ళు బతికేశారు. కొడుకులు, మనవాళ్లు పుట్టిన తర్వాత తోబుట్టువు ఉన్నాడన్న సంగతి తెలుసుకున్నారు. ఇప్పుడు శేష జీవితాన్ని కలిసి గడుపుతున్నారు. సొంత అన్నదమ్ములే తోడబుట్టినోడు బతికున్నాడో, పోయాడో లెక్కచేయని ఈరోజుల్లో అసలు ఉన్నాడన్న విషయమే తెలియకుండా బతికేసి.. కాళ్ళు కాటికి చాపే వయసులో తోబుట్టువు ఉన్నాడని తెలిసి కలుసుకోవడం అనేది గొప్ప విషయమే. మరి ఈ అపూర్వ సహోదరులపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.