స్పేస్‌ఎక్స్ చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ 'స్టార్‌షిప్' ప్రయోగం విఫలమైంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన ఈ భారీ రాకెట్.. ప్రయోగించిన కొద్దిసేపటికే పేలిపోయింది.
టెస్లా అధినేత, ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతి పెద్ద స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. దక్షిణ టెక్సాస్‌లోని బోకా చీకా తీరం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ నిమిషాల వ్యవధిలోనే పేలిపోయింది. ఈ వ్యోమనౌకకు చెందిన రెండు సెక్షన్లు (బూస్టర్, స్పేస్‌క్రాఫ్ట్).. నిర్ణీత సమయం 3 నిమిషాలలోగా విడిపోవాలి. కానీ, విఫలం కావడంతో అలా జరగలేదు. దీంతోనే ఒక్కసారిగా నింగిలోనే పేలిపోయింది.
స్పేస్‌ఎక్స్ యొక్క స్టార్‌షిప్, ఇప్పటివరకు నిర్మించిన రాకెట్లలో అత్యంత శక్తివంతమైనది ఇది. దీని పొడవు 120 మీటర్లు. అంతరిక్షంలోకి భారీ పేలోడ్స్‌ను తీసుకెళ్లడంతో పాటు చంద్రుడు, అంగారక గ్రహాల మీదకు వ్యోమగాములను పంపడానికి రూపొందించిన అంతరిక్ష నౌక ఇది. ఈ స్పేస్ షిప్ అంతరిక్ష పరిశోధనలను మలుపు తిప్పగలదని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ప్రస్తుతానికి దీన్ని టెస్ట్- ఫ్లైట్ కోసమే ప్రయోగించారు. దాదాపు గంటన్నర పాటు సాగే టెస్ట్ ఫ్లైట్‌లో భాగంగా.. ప్రయోగం ప్రారంభమైన మూడు నిమిషాలకు బూస్టర్ విడిపోయి గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పడేలా రూపొందించారు. ఫాల్కన్ 9 రాకెట్ల తయారీకి ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్నే ఈ స్టార్ షిప్ సూపర్ హెవీ నిర్మాణానికీ వినియోగించారు. ప్రయోగం విఫలమవ్వడానికి గల కారణాలను శాస్త్రవేత్తలు సమీక్షిస్తున్నట్లు స్పేస్‌ఎక్స్ సంస్థ వెల్లడించింది.
Liftoff of Starship! pic.twitter.com/4t8mRP37Gp
— SpaceX (@SpaceX) April 20, 2023
SpaceX Starship explodes after launch#SpaceX
— Crime With Bobby (@crimewithbobby) April 20, 2023