మన దగ్గర శీతాకాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కనిష్ట స్థాయికి పడిపోతాయి. దాంతో చలి పెరుగుతుంది. ఇక ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టాలంటేనే భయపడతాం. ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా.. సరే స్వెట్టర్, మాస్క్, మఫ్లర్ వంటివి వేసుకుని కానీ బయటకు రాము. శీతాకాలంలో మన దగ్గర కన్నా కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో చలి ప్రభావం బాగా ఉంటుంది. దానికి తోడు పొగమంచు ఇబ్బంది పెడుతుంది. ఇక మన దగ్గర నమోదయ్యే ఉష్ణోగ్రతలు చూసి మనం వామ్మో అనుకుని భయపడతాం. అలాంటిది 40 అడుగుల మేర మంచు కురిసి.. ఇంట్లో నుంచి బయటకు రాలేక.. రోడ్లన్ని మంచుతో కప్పబడి.. వాహనాల్లో ఉన్నవారు ఎక్కడికి వెళ్లలేక.. తిండి, నీరు లేక.. మంచులో గడ్డకట్టుకుపోయిన పరిస్థితులు ఉంటే.. వామ్మో తలుచుకోవడానికే భయంగా ఉంది కదా.. ఇదిగో.. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో.. గజగజా వణుకుతూ.. భయంభయంగా గడుపుతున్నారు అమెరికా ప్రజలు. మంచు తుపాన్ బాంబ్ సైక్లోన్.. అమెరికాను బెంబెలెత్తిస్తోంది. ఇంతకు బాంబ్ సైక్లోన్ అంటే ఏంటి.. దాని ప్రభావం అమెరికా మీద ఎలా ఉంది.. వంటి వివరాలు..
మంచు తుపాన్ బాంబ్ సైక్లోన్.. అమెరికాను గడ్డకట్టించింది. కనుచూపు మేర.. ఎక్కడ చూసిన మంచు తప్ప మరేం కనిపించడం లేదు. బాంబ్ సైక్లోన్ ప్రభావం కారణంగా అమెరికా అతలాకుతలం అవుతోంది. ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ఏకంగా మైనస్ 50 డిగ్రీలకు పడిపోయింది ఉష్ణోగ్రత. ఇప్పటికే అమెరికాలోని పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కరెంట్ లేక… హీటర్లు పనిచేయక.. నీటి సరఫరా నిలిచిపోయి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచు తుపాన్ కారణంగా ఇప్పటి వరకు 60 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క న్యూయార్క్‌లోనే 27 మంది మృతి చెందారు.
అమెరికాలో ఈ శతాబ్దంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా న్యూయార్క్‌లోని బఫలో నగరంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. కార్లు, ఇళ్లు, మంచుకుప్పల కింద మృతదేహాలు వెలుగు చూస్తూ.. హృదయవిదారక పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరిలో చాలా మంది అత్యవసర వైద్య సేవలు అందక చనిపోయిన వారే కావడం గమానార్హం. మంచు తుపాను కారణంగా అత్యవసర వైద్య సిబ్బంది రావాల్సిన సమయానికి రాలేకపోవడంతో.. మృతుల సంఖ్య పెరుగోతంది. ఇక బఫలో ఎయిర్‌పోర్ట్‌లో ఏకంగా 49 అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో.. విమాన సర్వీసులకు త్రీవ అంతరాయం ఏర్పడింది. ఫ్లైట్లు రద్దవ్వడంతో.. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగానే.. ఈ స్థాయి మంచు తుపాన్‌లకు కారణమని.. 60 శాతం జనాభాపై ఇది ప్రభావం చూపుతుందని అమెరికా వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోమవారం రోజునే ఏకంగా 3410 విమనాలు రద్దు చేశారు. ఆస్పత్రులకు రవాణా కోసం హైలిఫ్ట్ ట్రాకర్‌ను ఉపయోగిస్తున్నారు. మంచు తుపాను కారణంగా.. క్రిస్టమస్ పండుగ రోజు కూడా జనాలు ఇళ్లకే పరిమితం అయ్యారు.
ప్రస్తుతం అమెరికాను వణికిస్తున్న మంచు తుపాన్‌కు బాంబ్ సైక్లోన్‌గా పేరు పెట్టారు. తుపాను వచ్చినప్పుడు.. దాని వాతావరణ పీడనం కనిష్ట స్థాయికి చేరితే.. ఆ తుపానును బాంబ్ సైక్లోన్‌గా పిలుస్తారు. ప్రస్తుతం అమెరికాను కుదిపేసిన ఈ బాంబ్ సైక్లోన్.. గ్రేట్‌లేక్స్ ప్రాంతంలో ఏర్పడిందని.. దాంతో వాతావరణం మరింత ప్రమాదకరంగా మారిందని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. తుపాను కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు.. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. పలు చోట్ల ప్రభుత్వ గ్రంథాలయాలు, పోలీస్ స్టేషన్లను తాత్కలిక శిబిరాలుగా వినియోగిస్తున్నారు.