పక్షులు, జంతువులు సాధారణంగానే వలసపోతూ ఉంటాయి. రుతువు, వాతావరణాన్ని బట్టి ఒకచోటు నుంచి మరో చోటుకు వలసపోతాయి. అయితేే చాలావరకు తక్కువ దూరాలకే వెళ్తాయి. పక్షులయితే కొన్నిసార్లు దేశాలను కూడా దాటుతుంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే పక్షి మాత్రం ఏకంగా 13 వేల కిలోమీటర్లు ప్రయాణించేసింది. అది కూడా తిండి లేకుండా, విశ్రాంతి లేకుండా ఒక్కసారి గాల్లకి ఎగిరి కిందకు దిగకుండా 13 వేల కిలోమీటర్లు ఎగిరింది. ప్రస్తుతం ఈ పక్షి గతంలో ఉన్న రికార్డులన్నింటిని చెరిపేసింది.
గాడ్విట్ అనే పక్షి శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ పక్షి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఈ గాడ్విట్ పక్షికి 234684 నంబర్ కలిగిన ఒక శాటిలైట్ ట్యాగ్ ని అమర్చారు. దీని ద్వారా ఇది ఎక్కడికి వెళ్తోంది? ఎంత దూరం ప్రయాణిస్తోంది అనే విషయాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పక్షి అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని, శాస్త్రవేత్తలు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వెల్లడించారు. ఇది గతేడాది అక్టోబర్ నెలలో 13 వేలకుపైగా కిలోమీటర్లు ప్రయాణించిందని తెలిపారు.
గాడ్విట్ పక్షులు న్యూజిలాండ్ వెళ్తూ ఉంటాయి. కానీ, ఈ పక్షి అలస్కా నుంచి బయల్దేరి ఆస్ట్రేలియాలోని టాస్మేనియా వరకు ప్రయాణించింది. ఇది మొత్తం 11 రోజులపాటు సముద్రం మీదగా 13,650 కిలోమీటర్లు ప్రయాణించింది. నిజానికి దీనికి విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే నీటిలో తేలేందుకు దీని కాళ్లు సహకరించవు. సముద్రంలో దిగితే మునిగిపోతుంది. అందుకే తిండి, విశ్రాంతి లేకుండా అన్ని వేల కిలోమీటర్లు ఎగిరింది. ఈ ప్రయాణం వల్ల అది దాని శరీర బరువు సగం కోల్పోయుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ పక్షి ప్రయాణం ఒక రకంగా అదృష్టం మీద కూడా ఆధారపడి ఉందని చెబుతున్నారు. ఎందుకంటే దీని ప్రయాణంలో వాతావరణం సహకరించకపోతే సముద్రంలోనే చనిపోయేదని తెలిపారు. కానీ, ఈ పక్షి మాత్రం గతంలో వేరే పక్షి మీదున్న ప్రపంచ రికార్డును చెరిపేసింది. ఇది దారి తప్పడం వల్లే ఇలా కఠిన పరిస్థితుల్లో 13 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిందని చెబుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ గాడ్విట్ పక్షి మాత్రం హీరో అని చెబుతున్నారు. ఈ పక్షి నెలకొల్పన రికార్డు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.