లండన్- హైదరాబాద్ పేరు మరోసారి ప్రపంచస్థాయిలో మారు మ్రోగనుంది. ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ టీచర్ ప్రైజ్-2021 జాబితాలో హైదరాబాద్ కు చెందిన టీచర్ కు స్థానం లభించింది. 7.36 కోట్ల రూపాయల బహుమతి అందించే ఈ అవార్డుకు 121 దేశాల నుంచి 8 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. యునెస్కోతో కలిసి వార్కే ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందజేస్తోంది.
8వేలకు పైగా వచ్చిన దరఖాస్తులను వడపోసిన తరువాత రూపొందించిన టాప్ 50 జాబితాలో భారత్ నుంచి ఇద్దరికి చోటు లభించింది. హైదరాబాద్‌కు చెందిన టీచర్ ముసునూరి మేఘన, బిహార్‌లోని భగల్ పూర్‌కు చెందిన సత్యం మిశ్రాకు స్థానం దక్కింది. ఇక గణితం సబ్జెక్టులో హెచ్చవేతలను విద్యార్థులు సులంభంగా చేసేందుకు భీహార్ కు చెందిన సత్యం మిశ్రా కొత్త పద్ధతులను రూపొందించారు. విధ్యార్ధులు ప్రపంచాన్ని చూసే దృష్టిలో పెనుమార్పులు తేవడంతో పాటు, తన సబ్జెక్టును సరళం చేశారు సత్యం మిశ్రా.
ఇక హైదరాబాద్ కు చెందిన ముసునూరి మేఘన విద్యాబోధనలో ముందుచూపుతో పాటు, వృత్తి పట్ల అంకితభావం ఉన్న వ్యక్తి గా గుర్తింపు పొందారు. మేఘన హైదరాబాద్‌లో ఫౌంటెయిన్ హెడ్ గ్లోబల్ స్కూల్, జూనియర్ కాలేజీ వ్యవస్థాపక చైర్మన్. ప్రపంచ టెక్ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌కు చెందిన ఉమెన్ ఆంత్రప్రెన్యూర్స్ ఆన్ ద వెబ్ లో మేఘన హైదరాబాద్ చాంపియన్. ఇక ఈ సంవత్సరం చెగ్ ఓఆర్‌జీ గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్ 2021 జాబితాలో నలుగురు భారతీయ విద్యార్థులకు స్థానం లభించింది.
ఈ అవార్డు కింద 77 లక్షల రూపాయల నగదును ఇబహుమతిగా అందిస్తారు. ఈ రెండు విభాగాల్లో టాప్ 10లో నిలిచిన వారి పేర్లను వచ్చేనెల ప్రకటించనుంది యునెస్కో-వార్కే ఫౌండేషన్. గత సంవత్సరం గ్లోబల్ టీచర్ ప్రైజ్‌ను మహారాష్ట్రకు చెందిన రంజిత్ సింగ్ దిశాలే కైవసం చేసుకున్నారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడం, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని వార్కే ఫౌండేషన్ వ్యవస్థాపకులు సన్నీ వార్కే పేర్కొన్నారు.