వాహనాలు, రోడ్లు, ఇతరత్రా కారణాల వల్ల నిత్యం గాల్లోకి 40 రకాల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతున్నాయి. పీఎం 10, పీఎం 2.5 అత్యంత ప్రమాదకరమైనవి. పీఎం 2.5 కంటికి కనిపించదు. తల వెంట్రుక మందం(50 మైక్రోగ్రాములు)లో 20వ వంతు ఉంటుంది. గాలి పీల్చగానే నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడే స్థిరపడి అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఈ నేపధ్యంలో వాహన కాలుష్యం పరిమితిలోనే ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం (పీయూసీ) వాహనాలకి ఉండాలనే సంగతి తెలిసిందే. కాలుష్య పరీక్ష జాప్యం చేస్తే కుదరదు. వాహన కాలుష్య పరీక్షలు, ఫలితాల్ని ఆన్‌లైన్ చేయబోతున్నారు. బండి వివరాలు, ఫలితం రవాణాశాఖ, పోలీస్‌శాఖలకూ చేరిపోతాయి. ఒక్కరోజు ఆలస్యమైనా మీ వాహనంపై జరిమానా పడిపోతుంది. ఆరు నెలల గడువులోపు కాలుష్య పరీక్ష చేయించకపోతే జరిమానా పడిపోతుంది. ఆగస్టులో ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. వాహన కాలుష్య కట్టడికి కాలుష్య ఆన్‌లైన్‌తో అనుసంధానం చేయాలని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ నిర్ణయించింది. వాయుకాలుష్యంలో దాదాపు 50శాతానికి పైగా వాహనాల నుంచే వస్తోంది. ఈ నేపథ్యంలో వాహన కాలుష్య కట్టడికి కాలుష్య ధ్రువీకరణ పరీక్షలు, ఫలితాల్ని ఆన్‌లైన్‌తో అనుసంధానం చేయాలని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ నిర్ణయించింది.
పీసీబీ, రవాణా, పోలీసు, పురపాలక తదితర శాఖలు ఈ కమిటీలో ఉన్నాయి. హైదరాబాద్‌లో అమలు చేసి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 1.38 కోట్ల వాహనాలు ఉండగా హైదరాబాద్‌లోని వాహనాల నుంచే రోజుకు 1,500 టన్నుల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతున్నాయి.