దేశంలో ఇప్పుడు ఎవరిని కదిపినా కరోనా కష్టాలే వినిపిస్తున్నాయి. అయిన వారిని కోల్పోతూ, ఆస్తులు అన్నీ అమ్మేసినా సరైన ట్రీట్మెంట్ దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. ఇక రక్త సంబంధీకులు, ప్రాణ స్నేహితులు కూడా రోగిని దగ్గరికి తీసుకుని ఓదార్చలేని పరిస్థితి. కానీ.., ఇలాంటి స్థితిలో డాక్టర్స్ మాత్రం ప్రత్యక్ష దేవుళ్ళు అయ్యారు. ఉన్న అరాకొర వైద్య సదుపాయాలతోనే కొంతమంది ప్రజలనైనా బతికిస్తున్నారు. కానీ.., ఇలాంటి డాక్టర్స్ ని కూడా ఆర్ధికంగా దోచుకోవాలని చూస్తున్నారు కొంత మంది క్యాబ్ డ్రైవర్స్. తాజాగా ఇలాంటి అనుభవం కింగ్ కోఠిలోని ఆస్పత్రి పరిధిలో ఓ లేడీ డాక్టర్కు ఎదురైంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కింగ్కోఠి నుంచి అల్వాల్ వెళ్లేందుకు ఏకంగా రూ.2 వేలు డిమాండ్ చేశాడు ఓ క్యాబ్ డ్రైవర్. కింగ్కోఠి నుంచి అల్వాల్ మధ్య దూరం కేవలం 14 కిలో మీటర్లు మాత్రమే. మహా అయితే రూ. 300 నుండి రూ.400 మధ్యలో రైడ్ పూర్తి అయిపోతుంది. కానీ.., ఆ క్యాబ్ డ్రైవర్ మాత్రం ఇంతటి క్లిష్ట స్థితిలో అత్యాశకి పోయాడు. కింగ్కోఠి ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సంగీతకి ఈ అనుభవం ఎదురైంది. ఆమె బుధవారం 3గంటల సమయంలో డ్యూటీ ముగించుకుని బయటకి వచ్చింది. అల్వాల్లోని తన ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేయగా రూ.391కి చూపించింది. కానీ.., అంతలోనే ఆమెకి డ్రైవర్ నుండి కాల్ వచ్చింది. మీరు పేషెంటా? స్టాఫా? అని అడిగాడు డ్రైవర్. నేను డాక్టర్ ను అని చెప్పింది సంగీత. మీరు హాస్పిటల్ లో రోజంతా ఉంటారు కదా..? మిమ్మల్ని నా క్యాబ్ లో ఎక్కించుకోవడం రిస్క్. నాకు కూడా కరోనా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రూ.2 వేలు ఇస్తేనే వస్తానని లేకపోతే రైడ్ క్యాన్సిల్ చేయమన్నాడు. దీనితో డాక్టర్ సంగీత ఆశ్చర్యపోయింది. అక్కడే ఉన్న ఏసీపీ వెంకట్రెడ్డికి ఈ విషయం తెలిపారు. దీనితో.., అయన మరో రైడ్ బుక్ చేయించి.., ఆ డ్రైవర్ కి ఎక్స్ట్రా డబ్బులు అడగొద్దు అని ముందే వార్నింగ్ ఇచ్చి.. లేడీ డాక్టర్ ని ఇంటికి పంపారు. ఈ విషయాన్ని డాక్టర్ సంగీత సోషల్ మీడియాలో పంచుకోవడంతో అందరికీ తెలిసి వచ్చింది. కష్ట కాలంలో అండగా నిలిచిన డాక్టర్స్ ని గౌరవించాల్సింది పోయి.., ఇదేమి పని అంటూ అందరూ ఆ క్యాబ్ డ్రైవర్ ని దుమ్మెత్తి పోస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.