స్పెషల్ డెస్క్- ఆయన తెలుగు తనానికి నిదర్శనం. ఆయన అందానికి నిలువుటద్దం. ఆయన నటనకు మారు పేరు. ఆయన ప్రజా సేవకు చిరునామా. అవును ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇంతకీ ఆయనెవరో మీకు ఇప్పటికే అర్ధమయ్యే ఉంటుంది. అవును ఆయనే విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. ఈ రోజు ఎన్టీఆర్ 98వ పుట్టిన రోజు. ఎక్కడో మారుమూల పల్లెటూరిలో మామూలు వ్యవసాయ కుటుంబంలో పుట్టి.. సినీ రంగాన్ని ఏలి, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ గురించి ఆయన జయంతి సందర్బంగా ఒక్క సారి మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలం, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు మే 28వ తేదీ 1923 సంవత్సరంలో జన్మించారు నందమూరి తారక రామారావు. అప్పట్లో ఎన్టీఆర్ ది మామూలు వ్యవసాయ కుటుంబం. 1942 మే నెలలో అంటే ఎన్టీఆర్ కు 20 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్నిపెళ్లి చేసుకున్నారు. 1947లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న ఎన్టీఆర్ మంగళగిరిలో సబ్ రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేసిన ఆయన, సినిమాల్లో నటించాలనే కోరికతో ఆ ఉద్యోగం మానేసి మద్రాస్ రైలెక్కారు.
నందమూరి తారక రామారావు తొలిసారి మనదేశం అనే సినిమాకు మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ పాత్ర పోషించారు. ఆ తర్వాత రెెండో సినిమా పల్లెటూరి పిల్లలో నటించారు. ఇప్పటి చెన్నై.. అప్పటి మద్రాసులో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే వారట ఎన్టీఆర్. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ సినీ వినీలాకాశంలో తిరుగులేని రారాజు అయ్యారు నందమూరి తారక రామారావు. ఇక ఎన్టీఆర్ తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 సినిమాల్లో నటించారు. ఆయన కేవలం నటించడమే కాదు.. పలు సినిమాలను నిర్మించారు. మరికొన్ని సినిమాలకు స్వయంగా దర్శకత్వం కూడా వహించారు ఎన్టీఆర్.
తెలుగు సినీ ప్రపంచంలో తిరుగులేని వాడిగా పేరు తెచ్చుకుని విశ్వ విఖ్యాత నటసార్వభౌముడిగా ఖ్యాతి గాంచారు. సినిమాల్లో ఎెన్టీఆర్ వేసిన దేవుడి వేశాలు చూసి, నిజంగా దేవుడి రూపం ఇలానే ఉంటుందేమోనని ప్రేక్షకులు అనుకునేవారంటే ఆయన రూపు, నటన ఎంత గొప్పగా ఉండేవో అర్ధం చేసుకోవచ్చు. రాముడు, కృష్ణుడు లాంటి వేషాలు వేసే సమయంలోనే ప్రతినాయకులైన దుర్యోధనుడు, రావణాసురుడు వంటి పాత్రలు వేసి ఔరా అనిపించారు ఎన్టీఆర్. నందమూరి తారక రామారావును తెలుగు ప్రజల ప్రేమతో, అభిమానంతో అన్నగారు అని పిలుచుకుంటారు. ఇక సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు ఆన్టీఆర్. తెలుగుదేశం పార్టీని స్థాపించి, కేవలం ఎనిమిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టి, ముఖ్యమంత్రి ఐన అనితర సాధ్యుడు.
1980 దశకంలో ఢిల్లీ కనుసన్నల్లో రాజకీయం నడిచే రోజుల్లో, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీనే ఢీకొట్టి తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటిన ధీశాలి ఎన్టీఆర్. రాజకీయాల్లోకి వచ్చాక అనుకోని పరిస్థితుల్లో లక్ష్మీ పార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత 1996 జనవరి 18న గుండె పోటు రావడంతో హఠాత్తుగా మృతి చెందారు. ఈ మహానుబావుడి జీవిత చరిత్రను ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు రూపంలో రెండు సినిమాలు తెరకెక్కగా అందులో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ తండ్రి పాత్రను పోషించారు. ఎన్ని తరాలు మారినా, ఎంతమంది కొత్త తారలు సినీ లోకంలో వెలుగులు చిమ్మినా ఎన్టీఆర్ స్థానాన్ని కొంచెం కూడా కదపలేరని చెప్పుకోవడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు.