గత కొద్దిరోజులుగా NTR, రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అంటూ గొడవలు పడుతూ ఉన్నారు. గ్లోబర్ స్టార్ ఎవరు? అన్నదానిపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. నిజానికి గ్లోబర్ స్టార్ ఎవరంటే...
భారత దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన బహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి దేశ వ్యాప్తం అయింది. తెలుగు సినిమాకు దేశ వ్యాప్తంగా అతి పెద్ద మార్కెట్ ఏర్పడింది. హిందీ సినిమాలతో పోటీగా తెలుగు సినిమాలు ఆడతాయన్న భరోసా వచ్చింది. అంతేకాదు! బహుబలి సినిమాతో సౌత్ దర్శకుల్లో ఓ నమ్మకం వచ్చింది. మన సినిమాలు కూడా వేరే భాషల్లో ఆడతాయని నమ్మి, విడుదలకు సిద్ధం అయ్యారు. అలా పలు సౌత్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో.. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ఆర్ఆర్ఆర్ కేవలం తెలుగు సినిమా ఖ్యాతిని కాదు.. ఇండియన్ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు చేసింది.
ఓ ఇండియన్ సినిమాకు విదేశీ ప్రజలు సైతం బ్రహ్మరథం పట్టారు. హాలీవుడ్ కూడా ఇండియాన్ సినిమా వైపు తిరిగి చూసింది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమే.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీం అందుకుంటున్న అవార్డులు, ప్రశంసలు. రాజమౌళి హాలీవుడ్లో కిటిక్స్ ఛాయిస్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత నాటు, నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. తాజాగా, ఆర్ఆర్ఆర్కు హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. రామ్ చరణ్ ఈ అవార్డు ప్రధానోత్సవానికి వెళ్లారు. ఇక, అప్పటినుంచి గొడవ మొదలైంది. తమ హీరో గ్లోబల్ స్టార్ అని రామ్ చరణ్ ఫ్యాన్స్, కాదు.. తమ హీరో గ్లోబల్ స్టార్ అంటూ జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొట్టుకోవటం మొదలుపెట్టారు.
ఎంతలా అంటే సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్స్ గొడవ ఓ హాట్ టాపిక్‌గా మారేంతలా. ఈ ఫ్యాన్స్ గొడవ కాస్తా అవార్డులు ఇచ్చిన సంస్థను కూడా చేరింది. ఏకంగా దీనిపై ఆ సంస్థ స్పందించింది. మరి, ఇంతలా గొడవ పడేంత అవసరం ఉందా?.. అంటే కచ్చితంగా లేదు. నిజానికి ఇక్కడ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కాదు.. రామ్ చరణ్ కాదు.. రాజమౌళి కలే నిజమైన గ్లోబల్ స్టార్. ఆయన ఆర్ఆర్ఆర్ అనే కళా ఖండాన్ని చెక్కి.. అందులో ఇద్దరు ఢీ అంటే ఢీ అనే నటుల్ని పెట్టి ఓ అద్భుతం సృష్టించారు. ఆయన ఇదంతా చేస్తున్నది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు కోసం. ఓ స్థానిక భాషకు చెందిన సినిమాకు ఆస్కార్ రావటం అన్న ఇంత వరకు జరగలేదు. నిజం చెప్పాలంటే.. పూర్తి స్థాయి ఇండియన్ సినిమాకు ఆస్కార్ వచ్చిన దాఖలాలు లేవు.
ఆ కలను నెరవేర్చడానికి.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేయటానికి రాజమౌళి ఇంతలా శ్రమిస్తున్నారు. ఇందుకోసం దేశాలు పట్టుకు తిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవ పడటం నిజంగా హాస్యాస్పదం. ఈ ఇద్దరిలో ఒకరు తక్కువ కాదు.. ఒకరు ఎక్కువ కాదు. ఇది ఫ్యాన్స్ గుర్తించాలి. గొడవలు మాని రాజమౌళికి సపోర్ట్ చేయాలి. అప్పుడే తెలుగు సినిమా, ఇండియన్ సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తం అవుతుంది. భవిష్యత్తులో ఇండియన్ సినిమా మార్కెట్ ప్రపంచ వ్యాప్తం అవుతుంది.