'ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్..' ఇలాంటి సేవలు మనదేశంలో నిషేధం. మరి జరగట్లేవా..? అంటే అది అడక్కండి. ఈ సేవలు అందిస్తోన్న కంపెనీల సంఖ్య వేలల్లో ఉంటే.. వీటికి బానిసలైన వారు కోట్లలో ఉన్నారు. రోజూ కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. పోనీ అంతా సంపాదిస్తున్నారు కదా! పన్ను అయినా సక్రమంగా చెల్లిస్తున్నారా? అంటే అదీ లేదు.
మన దేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నిషేధమా..? అంటే నిషేధమే. కాకుంటే పేరుకు మాత్రమే. కొన్ని రాష్ట్రాలు వీటిపై నిషేధం విధించినా గుట్టుచప్పుడు కాకుండా దందా సాగుతోంది. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలలో ‘ఆన్‌లైన్ రమ్మీ నిషేధం’. మరి ఆడట్లేరా..? అంటే నో. ఆన్‌లైన్ రమ్మీకి బానిసలైన వారు వీధికో పది మంది ఉంటారు. ఇక్కడే ఉండి.. ఎక్కడో ఉన్నట్లు చూపించడానికి ‘fake GPS’ యాప్ ఇన్స్టాల్ చేయడం.. ఆడేయటం. ఇక ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్లకైతే లెక్కేలేదు. పోనీ ఇంతలా సంపాదిస్తున్నారు కదా! పన్ను అయినా సక్రమంగా చెల్లించాలా.. అదీ లేదు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు ఆన్‌లైన్ బెట్టింగ్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు.
దేశంలో మొబైల్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న కొన్ని ఆఫ్‌షోర్ కంపెనీలు జీఎస్‌టీ చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు గుర్తించారు. తద్వారా పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. జీఎస్‌టీ చట్టం కింద.. దేశంలో సేవలు అందిస్తోన్న అన్ని ఆఫ్‌షోర్ కంపెనీలు ఓఐడీఏఆర్ (ఆన్‌లైన్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ యాక్సెస్ అండ్ రిట్రీవల్) సేవల సరఫరాదారుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని కంపెనీలు.. ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫామ్ లను నిర్వహిస్తున్నా, జీఎస్‌టీ చట్టం కింద నమోదు చేసుకోవడం లేదు. తద్వారా పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నాయి.
గతేడాది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2019 ఏప్రిల్ నుండి 2022 నవంబరు మధ్య గేమింగ్ కంపెనీలు రూ.23,000 కోట్ల పన్ను ఎగవేతలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై జీఎస్‌టీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆఫ్‌షోర్ కంపెనీలు పన్ను ఎగవేతల నుండి తప్పించుకోవడానికి ప్రధాన కారణం.. మనదేశంలో వీటికి భౌతికంగా ఉనికి లేకపోవడం. తద్వారా నోటీసులు ఇవ్వాలన్నా కష్టంగా మారుతోంది. అంతేకాదు.. ఆయా కంపెనీలు తరచూ తమ బ్యాంకు ఖాతాలను మారుస్తూ ఉండడంతో ట్రేస్ చేయడమూ ఇబ్బందిగా ఉంటోంది. గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్‌లలో ఈ ఆన్‌లైన్, గ్యాంబ్లింగ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా పన్ను పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.