క్రైం డెస్క్- ఈ మధ్య కాలంలో ప్రేమలో వింత పోకడలను చూస్తున్నాం. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని, లేదంటే ప్రేమించి అబ్బాయి మోసం చేశాడని వింటున్నాం. కాని మోసాలన్నీ కేవలం డబ్బు కారణంగానే జరుగుతున్నాయని వేరే చెప్పక్కర్లేదు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడికోసం ఓ అమ్మాయి ఏకంగా 46 లక్షల రూపాయలు ఖర్చు చేసి, ఆఖరికి తాను మోసపోయింది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. ధర్మపురి ప్రాంతానికి చెందిన దిలీప్ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి ప్రేమించింది. పదేళ్ల క్రితం ప్రారంభమైన వీరి ప్రేమ మొన్నటి వరకు బాగానే సాగింది. తన ప్రియుడి కోసం ఆ అమ్మాయి చాలా చేసింది. ఇద్దరు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవాళ్లు. తన ప్రియుడిది చిన్న గుడిసె కావడంతో చదువుకోవడానికి ఆ అమ్మాయి ఇంటికి వచ్చేవాడతను. అలా క్రమంగా వీరి స్నేహం ప్రేమగా మారింది.
అంతే కాదు ఇరు కుటుంబాల పెద్దలు కూడా వారి పెళ్లికి అంగీకరించారు. ఆ అమ్మాయికి 2009లో ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. ఐతే డాక్టర్ కావాలని దిలీప్ కలలలు కనేవాడు. అతనిది పేద కుటుంబం కావడంతో అతని చదువు బాధ్యతను ఆ అమ్మాయి తీసుకుంది. ఆ అమ్మాయికి వచ్చే జీతంతో అతడిని చదివించింది. ఎమ్‌బీబీఎస్, పీజీ కూడా ఆ అమ్మాయి డబ్బులతోనే చదివాడతను. అంతే కాదు ప్రయుడికి ఇళ్లు కట్టుకోవడానికి కూడా ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చింది. ఆఖరికి కారు కొంటానంటే తానే లోన్ తీసుకుని మరీ డబ్బులు ఇచ్చింది.
ఇప్పటికీ కార్ లోన్‌కు సంబంధించిన ఈఎమ్‌ఐలు ఆ అమ్మాయి కడుతోంది. మొత్తానికి అతని కోసం పదేళ్లలో 46 లక్షల రూపాయలను ఖర్చు చేసింది. ఎలాగూ పెళ్లి చేసుకుంటాడు కదా అని ప్రియుడు అడగ్గానే శారీరకంగా కూడా కలుసుకున్నారు. ఇక అతని చదువు పూర్తి అవ్వగానే 2017లో ఓ హాస్పిటల్‌లో డాక్టర్‌గా జాయిన్ అయ్యాడు. అదిగో అప్పటి నుంచి అతనిలో మార్పు రాసాగింది. ఆ అమ్మాయితో మాట్లాడటం తగ్గించేశాడు.
చివరకు గత నెల 21న రహస్యంగా ఇంకో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలియడంతో అవాక్కైన ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. దిలీప్ తనపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, పెళ్లి విషయంలో తనను నమ్మించి మోసం చేశాడని పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దిలీప్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కలికాలం అంటే ఇదే మరి.