హైదరాబాద్- సాధారణంగా ఎండాకాలంలో అగ్నిప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఐతే కొన్ని అనివార్య కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు ఎప్పుడైనా జరగవచ్చు. అదే ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు జరిగితే మరింత డేంజర్. సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. హాస్పిటల్ లోని నాలుగో అంతస్తులో ఉన్న లేబర్ డిపార్ట్ మెంట్ విద్యుత్ బోర్డులో షార్ట్ సర్య్కూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఆస్పత్రిలో దట్టమైన పొగ వ్యాపించడంతో రోగులు ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. కొద్ది క్షణాల్లోనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఆస్పత్రిలో వ్యాపించిన మంటలు ఆర్పేశారు. గాంధీ ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంతో పలు వార్డుల్లోకి దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో రోగులు శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సకాలంలో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా పలు వార్డుల్లోని రోగులను బయటికి పంపించేశారు. బాలింతలు సైతం నవజాత శిశువులను ఎత్తుకుని బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం, ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొంత మంది రోగులను వేరే అంతస్తుల్లోని వార్డులకు పంపించారు.
ఆస్పత్రిలోని విద్యుత్ బోర్డ్ లో షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగిందని ప్రాధమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పారు. అగ్నిప్రమాదం నేపధ్యంలో ఆస్పత్రిలో విద్యుత్ సరఫరాకు అతరాయం కలగడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నారు.