నేషనల్ డెస్క్- టీనా దాబి, అతహర్ అమీర్ ఖాన్ గుర్తున్నారు కదా.. అదేనండీ 2015లో సివిల్స్ లో టాపర్స్ గా నిలిచి, ఆ తరువాత ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు వీరిద్దరి పెళ్లి దేశంలోనే సంచలనంగా మారింది. మరి ఏమైందో ఏమోగాని టీనా దాబి, అతహర్ అమీర్ ఖాన్ జంట విడిపోయారు. ఈమేరకు వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.
టీనా దాబి 2015 సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరై తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచింది. తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌కు ఎంపికావడంతో పాటు, టాపర్‌గా నిలిచిన మొదటి దళిత యువతిగా దేశం దృష్టిని ఆకర్షించింది టినా దాబి. ఇక అదే సంవత్సరం సివిల్స్‌లో కశ్మీర్‌లోని అనంతనాగ్‌కు చెందిన అథర్ ఆమిర్ ఖాన్ రెండో ర్యాంకు సాధించాడు. ట్రైనింగ్ సమయంలో విరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు బిజం పోసింది.
ఇంకేముంది ఇద్దరి మతాలు వేరైనా, ఇరువురి కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2018లో ఢిల్లీలో జరిగిన వీరి పెళ్లికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అప్పటి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఈ ఇద్దరికీ జైపుర్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అథర్ ఆమిర్ ఖాన్ జమ్మూ కశ్మీర్‌కు డిప్యుటేషనుపై వెళ్లాడు. గతేడాది నవంబరులో రాజస్థాన్ ఆర్ధిక శాఖ జాయింట్ సెక్రెటరీగా టీనా దాబి చేరారు.
అయితే హఠాత్తుగా ఈ జంట వైవాహిక బంధం మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. తమకు విడాకులు కావాలంటూ గతేడాది నవంబరులో వీరిద్దరూ కోర్టును ఆశ్రయించారు. ఈ దంపతులకు జైపుర్ కుటుంబ న్యాయస్థానం మంగళవారం విడాకులు మంజూరు చేసింది. పరస్పర అంగీకారంతోనే టీనా, అమిర్‌ఖాన్‌లకు విడాకులు మంజూరయ్యాయి. తాము విడిపోవడానికి మతపరమైన అంశాలేవీ కారణం కాదని టీనా డాబి చెప్పుకొచ్చింది.