దంపతులుగా కలిసి ఉన్న సమయంలో భార్యను వేధింపులకు గురి చేస్తాడు భర్త. ఆ మానసిక వేదన తట్టుకోలేకపోయినా.. పిల్లల మొహం చూసి కొంత మంది మహిళలు కాంప్రమైజ్ రాగాన్ని ఆలపిస్తుంటే.. భర్తల చేతిలో తన్నులు తినే కంటే.. విడిపోయి
దంపతులుగా కలిసి ఉన్న సమయంలో భార్యను వేధింపులకు గురి చేస్తాడు భర్త. ఆ మానసిక వేదన తట్టుకోలేకపోయినా.. పిల్లల మొహం చూసి కొంత మంది మహిళలు కాంప్రమైజ్ రాగాన్ని ఆలపిస్తుంటే.. భర్తల చేతిలో తన్నులు తినే కంటే.. విడిపోయి తమ కాళ్లపై తాము బతుకుతూ పిల్లల్ని పెంచుకోవచ్చునని ఆలోచించే మహిళలు మరికొంతమంది. అలాంటి మహిళలు.. భర్త నుండి విడాకులు కావాలంటే కోర్టు మెట్లెక్కుతున్నారు. విచారణ చేపట్టి కోర్టు విడాకులు మంజూరు చేస్తూ భరణం ఇవ్వాలని ఆదేశిస్తుంది. ఓ భార్య భర్తల విషయంలో ఇదే తీర్పు ఇచ్చింది కోర్టు. భార్యకు పోషణ నిమిత్తం భరణం కింద ప్రతి నెల రూ. 5 వేలు ఇవ్వాలని ఆదేశించగా.. భర్త చేసిన చేష్టలకు కోర్టు కూడా ఆశ్చర్యపోయింది.
కలిసి ఉన్నప్పుడు కాదు విడిపోయిన సమయంలో కూడా భార్యను టార్చర్ చేశాడు భర్త. భరణం కింద ఇవ్వాల్సిన డబ్బులను చిల్లరగా తీసుకు వచ్చి వాటిని తీసుకోవాలంటూ చిల్లర వేషాలు వేసేందుకు ప్రయత్నించాడు. కోర్టు అతడి తీరును చూసి.. భర్తకు వాత పెట్టే తీర్పునిచ్చింది. అసలేమైందంటే.. రాజస్తాన్‌లోని జైపూర్ హర్మదా ప్రాంతానికి చెందిన దశరథ్ కుమావత్, భార్య సీమలకు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన 3-4 ఏళ్లకు గొడవలు ప్రారంభమయ్యాయి. విడాకులు కోసం కోర్టును ఆశ్రయించారు. విడాకులు మంజూరు చేసిన కోర్టు భరణం కింద ప్రతి నెల రూ. 5వేలు ఇవ్వాలని తీర్పునిచ్చింది. అయితే 11 నెలల నుండి ఎటువంటి భరణం చెల్లించకపోవడంతో సీమ కోర్టును ఆశ్రయించింది. దీంతో భర్త దశరథ్‌కు రికవరీ వారెంట్ జారీ చేసింది. అయినప్పటికీ అతడు డబ్బులు చెల్లించేందుకు నిరాకరించడంతో అరెస్టు వారెంట్ జారీ చేసింది.
పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఆ డబ్బును.. చిల్లర రూపంలో ఏడు బస్తాల్లో తీసుకు వచ్చి అప్పగించగా.. భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ డబ్బు తీసుకునేందుకు నిరాకరించింది. ఇవి కరెన్సీకి చెల్లుబాటు ఉందీ తీసుకోవాలంటూ భార్యను టార్చర్ చేసే ప్రయత్నం చేశాడు. 11 నెలల భరణమైన రూ. 55 వేలను రూపాయి, రెండు రూపాయల నాణేల రూపంలో తీసుకువచ్చారు. సుమారు 280 కేజీల దాకా బరువు ఉంది. అతడి తీరును గమనించిన కోర్టు.. వాటిని తీసుకోవాలని సీమకు చెబుతూనే.. ఆ మొత్తాన్నివెయ్యి రూపాయల వంతున స్వయంగా లెక్కించి ఇవ్వాలంటూ భర్తను ఆదేశించింది. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టు సెలవులో ఉండటంతో పోలీసులు దశరథ్‌ను అదనపు జిల్లా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేశారు. డబ్బులు చెల్లించడంతో అతడికి బెయిల్ మంజూరు చేశారు.