ఎయిర్‌ఇండియా విమానాలు ఇటీవల కాలంలో చిత్రమైన కారణాలతో ఆలస్యం అవుతున్నాయి. ఈ ఏడాది జులైలోనూ సౌదీ అరేబియా వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సరకు రవాణా విమానాన్ని కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం విండ్ షీల్డ్‌లో పగుళ్లు గుర్తించడమే ఇందుకు కారణం. అంతకుముందు మేలో ఢిల్లీ నుంచి అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం బిజినెస్ క్లాస్‌లో గబ్బిలం ఉన్నట్లు గుర్తించారు. హాలీవుడ్ లో యాంట్స్ అనే సినిమా వచ్చింది గుర్తుంది కదా. ఆ సినిమాలో విమానం ప్రయాణం చేస్తుండగా చీమలు దాడులు చేస్తాయి. విమానం లోపల జరిగే ఆ సీన్స్ నిజంగా తలచుకుంటేనే భయం వేస్తుంది. ఇలాంటి సంఘటనే న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది.
ఢిల్లీ నుంచి ఏఐ111 విమానం లండన్‌కు వెళ్లాల్సి ఉన్నది. మొత్తం 248 ప్రయాణికులతో టెకాఫ్ కావడానికి సిద్దంగా ఉన్నది. అందులో భూటాన్ యువరాజు కుడా ఉన్నారు. ఉన్నట్టుండి బిజినెస్ క్లాస్‌లోనుంచి ప్రయాణికులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. సిబ్బంది వెళ్లి చూడగా విమానంలో పెద్ద పెద్ద గండు చీమలు కనిపించాయి. వెంటనే సిబ్బంది ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారం అందించి ప్రయాణికులను కిందకు దించేశారు. ఢిల్లీ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం చీమల కారణంగా కొన్ని గంటలు ఆలస్యం కావడం సంచలనంగా మారింది. బిజినెస్ క్లాసులో చీమల గుంపు కనిపించడంతో టేకాఫ్‌ను ఆపేశారు పైలట్.
చీమలను దులిపేస్తే సరిపోదు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడం కూడా ముఖ్యం. సున్నితమైన విమాన భాగాల్లో చీమల గుంపు ఉండిఉంటే ఎంతో ప్రమాదకరం. అందుకే, చీమల రాదారిని కనిపెట్టే వరకూ విమానాన్ని నడిపే పరిస్థితి లేదు. ప్రయాణికులను మరో విమానంలోకి ఎక్కించి పంపించారు. విమానం అంటే రిచ్ అండ్ నీట్ మెయిన్టెనెన్స్ ఉంటుంది. అందులోనూ బిజినెస్ క్లాస్ అంటే మరింత క్లీన్‌నెస్ తప్పనిసరి. అలాంటిది రిచ్ క్లాస్ పీపుల్ జర్నీ చేసే బిజినెస్ క్లాస్‌లోనే చీమల గుంపు వచ్చి చేరిందంటే విమానాల పని తీరు ఎలా ఉందో అర్థం అవుతుంది.