ఫిల్మ్ డెస్క్- టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ లో బైక్ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డారు. రాయదుర్గం కేబుల్ బ్రిడ్జ్ ఐకియా మార్గంలో వేగంగా వెళుతున్న ఆయన స్పోర్ట్స్ బైక్ జారిడపడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ కు తీవ్రంగా గాయాలయ్యాయి.
ఇక ఈ రోడ్డు ప్రమాదంపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా జరిగిన ప్రమాదాన్ని నిర్దారించిన రాయగుర్గం పోలీసులు ఐపీసీ సెక్షన్ 336, 180 ఎంవీ నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు కేసు నమోదు చేశారు. గత సంవత్సరం ఆగస్ట్ 2న సాయి ధరమ్ తేజ్ వేగంగా బైకు నడిపాడని ట్రాఫిక్ పోలీసులు ఓవర్ స్పీడ్ జరిమానా కూడా విధించారు.
మరోవైపు సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగింని తెలియడంతో మెగా ఫ్యామిలీ, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మెగస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్‌కళ్యాణ్, అల్లు అరవింద్, వరుణ్‌తేజ్, నిహారిక, వైష్ణవ్ తేజ్ సహా ఇతర మెగా కుటుంబ సభ్యులందరూ శుక్రవారం రాత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌లోనే ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ కు ఏంజరుగుతుందోనని రాత్రంతా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సాయి ధరమ్ తేజ్‌కు భుజం దగ్గర ఉండే ఎముక విరిగిందని వైద్యులు తెలిపారు.
అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన నలుగురు స్పెషలిస్ట్ అపోలో డాక్టర్స్ ప్రాణాపాయం లేదని చెప్పారు. అయితే 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచామని డాక్టర్లు తెలిపారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, వరుణ్ తేజ్ సహా హీరోలందరూ సాయి ధరమ్ తేజ్‌కు ప్రాణాపాయం లేదని చెబుతూ ట్వీట్స్ చేశారు. సినీ పరిశ్రమలోని ప్రముఖులు, సాయితేజ్ స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.