అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకుకి పెళ్లి చేయాలి అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. నిజాన్ని దాచి.., ఓ అమ్మాయిని కోడలిగా తెచ్చుకున్నారు. ఆరోగ్యవంతుడు కాని భర్తతో ఆ ఇల్లాలు నరకం చూసింది. కానీ..,పెళ్ళైన కొన్నాళ్లకే ఆ భర్త కన్నుమూశాడు. కోడలిని, మనవరాలిని ఆదరించాల్సిన ఆ అత్తమామలు ఆమెని ఇంట్లోకి రానివ్వకుండా అడ్దుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? తెలుగు టీవీ సీరియల్స్ ని మించిన దారుణ ఘటన ఇది. ఆ వివరాల్లోకి వెళ్తే..
నెల్లూరు జిల్లా ధనలక్ష్మిపురంకు చెందిన విజయేంద్ర రెడ్డికి కిడ్నీల సమస్య ఉంది. ఈ విషయాన్ని దాచి.., తిరుపతి కి చెందిన ఊహా రెడ్డితో పెళ్లి జరిపించారు అబ్బాయి తల్లదండ్రులు. పెళ్ళైన కొన్నాళ్లకే అతనికి ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఈక్రమంలోనే అతనికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కాలు చేయి పడిపోయింది. తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నారని భార్యకి అప్పుడే అసలు నిజం తెలిసింది. నిజాన్ని దాచి పెళ్లి చేసుకున్నందుకు, అనారోగ్య బాధలను భరించలేక.. భర్త విజయేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ.., అతను చనిపోయే నాటికే ఊహ గర్భవతి.
భర్త మరణం తరువాత డెలివరీ కోసం పుట్టింటికి చేరింది ఊహ. కొన్ని నెలలకి ఆమెకి కూతురు పుట్టింది. కానీ.., అత్తమామలు మనవరాలిని చూడటానికి కూడా రాలేదు. ఎన్ని నెలలు గడిచినా వారు కోడలిని, మనవరాలిని దూరం పెడుతూ వచ్చారు. ఇక చేసేది లేక.. పాపను తీసుకొని అత్తింటికి వచ్చింది ఊహ. కానీ.., అత్తమామలు వారిని లోపలికి రానివ్వలేదు. పైగా.., కోడలిపైకి దాడికి దిగారు. అడ్డు వచ్చిన ఆమె కుటుంబ సభ్యులను రాళ్లతో కొట్టారు. కోడలిని జుట్టు పట్టి ఈడ్చారు. దెబ్బలు తగిలి రక్తం కారుతున్నా ఊహ మాత్రం మెట్టినింటి ముందు కూర్చొని, తనకు న్యాయం చేయాలని కోరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఈ పంచాయతీ అంతా పోలీస్ స్టేషన్ కి చేరింది. నెటిజన్స్.. ఊహకి, ఆమె బిడ్డకి న్యాయం చేయాలని, ఊహ జీవితాన్ని నాశనం చేసిన అత్తమామలను తీవ్రంగా శిక్షించాలని కోరుతున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.