క్రైం డెస్క్- ప్రస్తుతం కాలంలో అమ్మాయిలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ప్రతి రోజు ఎక్కడో చోట అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఐతే అప్పుడప్పుడు మగవాళ్లపైనా వెధింపులు జరుగుతుంటాయి. అమ్మాయిలు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల యువకులు సైతం బలైపోతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.
మహారాష్ట్రలో ఇలాంటి ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి ఇంట్లో లేనప్పుడు తనపై అత్యాచారం చేశాడంటూ ఓ యువతి సొంత అన్నపై కేసు పెట్టింది. ఇంకేముంది ఆ యువకుడి జీవితం ఒక్కసారిగా తలక్రిందులైంది. ఆ యువకుడు రెండేళ్ల పాటు జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇందులో ఇంత ఇదిగా చెప్పుకోవాల్సింది ఏముంది, సొంత చెల్లిపై అత్యాచారం చేసినవాడికి ఆ మాత్రం శాస్తి జరగాల్సిందేనని అంనుకుంటున్నారు కదా.
ఐతే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. 2019లో మహారాష్ట్రలో ఈ ఘటన యువతి ఫిర్యాదు చేయడంతో ఆమె అన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సమయంలో ఆమె మైనర్ కూడా కావడంతో యువకుడిపై పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. దీంతో అతడు రెండేళ్ల పాటు జైల్లోనే గడిపాడు. తాజాగా ఆ యువతి అసలు నిజం చెప్పేందుకు ముందుకు వచ్చింది.
ఆ రోజు తాను బాయ్ ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లడంతో అన్నయ్య తనపై కోపడటంతో పాటు, చేయి కూడా చేసుకున్నాడని చెప్పింది. అందుకని అన్నపై కోపంతో ఇలా ఫిర్యాదు చేశానని అసలు విషయం చెప్పింది ఆ యువతి. యువతితో పాటు, ప్రత్యేక దర్యాప్తు అధికారి చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు యువకుడిని నిర్దోషిగా తేల్చింది. దీంతో ఇన్ని రోజులు చేయని నేరానికి నరకం అనుభవించిన ఆ యులకుడు జైలు నుంచి విడుదల అయ్యాడు.