తారకరత్న భౌతికదేహం ఈ ఉదయం శంకరపల్లి, మోకిలలోని ఇంటికి చేరుకుంది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఇంటికి వెళ్లి తారకరత్న భౌతికదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు దంపతులు అక్కడికి వెళ్లారు.
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దంపతులు శంకరపల్లి, మోకిలలోని తారకరత్న ఇంటికి వెళ్లారు. చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరి తారకరత్న భౌతికదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. చంద్రబాబు, విజయసాయిరెడ్డి పక్కపక్కన కూర్చుని మాట్లాడుకున్నారు. చంద్రబాబు తారకరత్న ఇంటికి రావటానికి ఓ అరగంట ముందే విజయసాయి రెడ్డి అక్కడికి వచ్చారు. అల్లుడి భౌతికదేహానికి నివాళులు అర్పించారు. అప్పటినుంచి అక్కడే ఉన్నారు. కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో కూడా విజయసాయిరెడ్డి మాట్లాడారు.
ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. దాదాపు 10 నిమిషాలకు పైగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డిని చంద్రబాబు ఓదార్చినట్లు తెలుస్తోంది. తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి విజయసాయిరెడ్డికి కూతురు వరుస అవుతుంది. ఆ రకంగా చంద్రబాబు, విజయసాయిరెడ్డి అన్నదమ్ములవుతారు. ఇంటికి పెద్ద దిక్కుగా చంద్రబాబు నాయుడు విజయసాయిరెడ్డిని ఓదార్చినట్లు సమాచారం. ఇక, తారకరత్న భౌతికదేహాన్ని రేపు ఫిలిం ఛాంబర్‌కు తరలించనున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి అభిమానుల సందర్శనకోసం ఉంచనున్నారు. రేపు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.
కాగా, తారకరత్న జనవరి 26న గుండెపోటుకు గురయ్యారు. దాదాపు 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స తీసుకున్నారు. విదేశీ వైద్యుల బృందం ఆయనకు ప్రత్యేక వైద్యాన్ని అందించింది. అయినప్పటికి ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పురాలేదు. శరీరంలోని కొన్ని అవయవాలు పని చేయకుండా పోయాయి. దీంతో కోలుకోవటం కష్టంగా మారింది. శనివారం తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఈ నేపథ్యంలోనే శనివారం తారకరత్న తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉదయం ఆయన భౌతకదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. మరి, చంద్రబాబు, విజయసాయిరెడ్డి మాట్లాడుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.