మహారాష్ట్ర- ఒక్కోసారి పోలీసుల దగ్గరకు భలే విచిత్రమైన కేసులు వస్తుంటాయి. అటువంటి సందర్బాల్లో ఎవరిపై కేసు నమోదు చేయాలో తెలియక పోలీసులు అయోమయానికి గురవుతుంటారు. తాగాజా మహారాష్ట్ర పోలీసులకు ఇలాంటి వింత అనుభవమే ఎదురైంది. కాసేపు తర్జన భర్జన పడ్డప్పటికీ, చివరికి సమస్యను సమర్ధవంతంగా పరిష్కరించారు పోలీసులు.
మహారాష్ట్రలోని పుణెలో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలేంజరిగిందంటే.. ఈనెల 8న సాయంత్రం పూట జుబేర్ షేక్ అనే వైద్యుడు తన భార్యతో కలిసి బైక్‌పై వెళుతున్నారు. ఇదే సమయంలో ముగ్గురు వ్యక్తులు తమ గేదెలను తోలుకుని రోడ్డుపై వస్తున్నారు. మరి ఏంజరిగందో గాని ఒక గేదె బైక్‌పై నెమ్మదిగా వెళ్తున్న వారి పైకి దూసుకెళ్లి తన కొమ్ములతో దాడి చేసింది. ఈ దాడిలో ఒక వ్యక్తికి చేతి వేళ్లు కమిలిపోగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యారు.
వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి వారికి చికిత్స అందించారు. ఆ తరువాత ఈ ఘటనపై బాధితులు పోలీసులకు పిర్యాదు చేశారు. గేదెల యజమానులను పిలిచి విచారించగా, తమదేం తప్పులేదని, గెదెలు దాడి చేస్తే మమ్మల్నేం చేయమంటారని ప్రశ్నించారు. దాడికి పాల్పడింది గేదె కాబట్టి గేదెపై కేసు పెట్టాలని, తమపై కేసు ఎలా పెడతారని వారు వాదించారు. దీంతో కాస్త అయోమయంలో పడ్డ పోలీసులు ఎందుకైనా మంచిదన న్యాయ సలహా తీసుకున్నారు.
మూగజీవాలు దాడి చేసినప్పుడు యజమానులదే భాద్యత అని తేలడంతో.. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు గేదెల యజమానులైన రజాక్, అతడి సోదరులు సదాకత్, నదాఫత్‌లను అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.