హైదరాబాద్- వైద్య శాస్త్రంలో పేను మార్పులు వస్తున్నాయి. అధునాతనమైన పరిశోధనలతో కూడిన సాంకేతికత అభివృద్ది చెందడంతో మనిమిషి చనిపోయినా, మరి కొందరికి జీవితాన్ని ఇవ్వగలుగుతున్నాడు. చనిపోయిన వ్యక్తి నుంచి అవయవాలను సేకరించి, మరో ముగ్గురు, నలుగురి జీవితంలో వెలుగులు నింపుతున్నారు వైద్యులు. ఇదిగో ఇటువంటి క్రమంలో హైదరాబాద్ లో అరుదైన ఘటన చోటు చేసుకుంది.
బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి నుంచి మొట్ట మొదటి సారిగా చర్మాన్ని సేకరించారు మన హైదరాబాద్ వైద్యులు. అవును ఇది వైద్య శాస్త్రంలో అరుదైన ఘటనగానే చెప్పుకోవాలి. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలకు చెందిన 48 ఏళ్ల కాసా రఘునాథ్‌రెడ్డిని ఈ నెల 13న నల్గొండ జిల్లా చింతపల్లి వద్ద ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయనను హైదరాబాద్ హస్తినాపురంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.
రఘునాధ రెడ్డి పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి అతన్ని నిమ్స్‌కు తరలించారు. ఐతే ఈ నెల 16న అతడు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. జీవన్ దాన్ సభ్యులు రఘునాథ్ రెడ్డి కుటుంబాన్ని సంప్రదించి, అవయవదానం గురించి అవగాహన కల్పించారు. అందుకు అతని కుటుంబ సభ్యులు అంగీకరించడంతో అతని నుంచి అవయవాలు సేకరించి బాధితులకు అమర్చేందుకు ఏర్పాటు చేశారు.
ఈనేపధ్యంలో రఘునాధ రెడ్డి నుంచి చర్మాన్ని సేకరించారు వైద్యులు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి చర్మాన్ని సేకరించడం ఇదే మొదటి సారి అని జీవన్‌దాన్ నిర్వాహకులు తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన చర్మాన్ని ఉస్మానియా ఆస్పత్రిలో భద్రపర్చారు. దాత నుంచి చర్మాన్నే కాకుండా రెండు మూత్రపిండాలు, రెండు కార్నియాలు సేకరించి బాధితులకు అమర్చారు. అతని అవయవాల దానం వల్ల నలుగురు వ్యక్తులకు పునర్జన్మ లభించింది.