హైదరాబాద్- ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కేవలం డ్రగ్స్ కేసు గురించి మాత్రమే చర్చ జరుగుతోంది. 2017లో వెలుగులోకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ హఠాత్తుగా తెరపైకి వచ్చింది. అనూహ్యంగా ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డ్రగ్స్ కేసుపై దృష్టి సారించడంతో. తెలుగు సినీ ప్రముఖులను నోటీసులను జారీ చేసి విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మంగళవారం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు.
పూరీ జగన్నాధ్ ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన తదితర అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నించారు. పూరి తీసిన సినిమాలు, ఆయన బ్యాంకు లావాదేవీలు, విదేశీ వ్యక్తులతో ఆర్ధిక సంబంధాలు, విదేశీ డ్రగ్స్ డీలర్స్ తో సంబంధాలు వంటి అంశాలపై ఈడీ సుదీర్గంగా ప్రశ్నించింది. ఇంతవరకు బాగానే ఉన్నా పూరీ జగన్నాధ్ తో పాటు సినీ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఈ విచారణ సమయంలో కనిపించడంతో ఒక్క సారిగా అందరిలో ఆసక్తి నెలకొంది.
ఇంకేముంది నిర్మాత బండ్ల గణేష్ కు కూడా టాలీవుడ్ డ్రగ్స్ కేసుతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని అందరిలో అనుమానాలు రేకెత్తాయి. అంతలోనే పూరి జగన్నాధ్ చెప్పిన వివరాల ఆధారంగా ఈడీ బండ్ల గణేష్ ను విచారణకు పిలిచిందన్న ప్రచారం జోరుగా సాగింది. ఐతే ఈ ప్రచారంపై బండ్ల గణేష్ స్పందించారు. తనకు, డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబందం లేదని చెప్పుకొచ్చారు.
దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నాకు ఏ విధమైన సంబంధం లేదు, నేను పూరి గారికి మద్దతుగా మాత్రమే వచ్చాను.. అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. అంతకు ముందు ఈడీ కార్యాలయం దగ్గర మీడియా ఇదే ప్రశ్నను సంధించగా.. అమ్మ మీద ఒట్టు నాకేం తెలియదు.. పూరి జగన్నాధ్‌ను కలవడానికి మాత్రమే వచ్చాను.. పూరి నా మిత్రుడు.. ఉదయం ఎప్పుడో వచ్చాడు.. ఏం జరిగిందోనని టెన్షన్‌గా ఉంది.. అందుకే తెలుసుకోవడానికి వచ్చాను.. అని చెప్పారు.
దయచేసి నన్ను అర్థం చేసుకోండి నాకు ఏ విధమైన సంబంధం లేదు నేను పూరి గారికి మద్దతుగా మాత్రమే వచ్చారు 🙏
— BANDLA GANESH. (@ganeshbandla) August 31, 2021