అమరావతి- నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కత్తి మహేశ్ మృతిపై తనకు అనుమానాలున్నాయని చెప్పారు. అంతే కాదు కత్తి మహేశ్ తండ్రి ఓబులేషు సైతం తన కొడుకు మృతి పట్ల అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు చనిపోయిన విషయాన్ని తమకంటే ముందే బయటకు చెప్పారని ఆయన తెలిపారు.
కత్తి మహేశ్ మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంపై లోతుగా విచారణ జరపాలని కత్తి మహేశ్ తండ్రి ఓబులేషు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆయన విజ్ఞప్తిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం కత్తి మహేశ్ మరణంపై విచారణకు ఆదేశించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మహేశ్ కారు డ్రైవర్ సురేష్‌ను విచారించారు. ప్రమాదం జరిగిన తీరు, కత్తి మహేష్ తీవ్రంగా గాయపడితే డ్రైవర్ సురేష్‌కు ఎందుకు చిన్నగాయం కాలేదన్న కోణంలో ఏపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కత్తి మహేశ్ కారు ప్రమాదానికి గురైన తర్వాత ఏం జరిగిందన్న దానిపైనా పోలీసులు దృష్టి సారించారు. గత నెల 26న నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. ముందు నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో కత్తి మహేశ్ శనివారం మృతి చెందారు.