ఇబ్రహీంపట్నం- సోషల్ మీడియా ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతోంది. సోషల్ మీడియా లేని ప్రపంచాన్ని అస్సలు ఊహించుకోలేము. అందులోను యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా వెంటనే యూట్యూబ్ లో అప్ లోడ్ చేసేస్తున్నారు. యూట్యూబ్ వల్ల చాలా మంది ఎంతో నేర్చుకుంటున్నారు. కరోనా సమయంలో విధ్యార్ధులు యూట్యూబ్ ద్వార ఆన్ లైన్ క్లాసులు విని ప్రయోజనం పొందారు. ఐతే సోషల్ మీడియా వల్ల మంచి ఎంతుందో.. దాన్ని మిస్ యూజ్ చేస్తే చెడు కూడా అంతే ఉంటుంది. కొంత మంది సోషల్ మీడియాను చెడు మార్గాలను ఉపయోగించుకుంటున్నారు.
ఆంద్రప్రదేశ్ లో కలకలం సృష్టించిన దొంగనోట్ల కేసును ఛేదించిన పోలీసులు అవాక్కైపోయారు. ఎందుకంటే దోంగ నోట్లను తయారు చేసేందుకు కొందరు సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో గత నెల 23వ తేదీన దూలం సాయి, గొట్టిముక్కల రవిశరన్, భీమవరపు యజ్ఞప్రదీప్, నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తుల వద్ద దొంగనోట్లు లభించడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు అదేరోజు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో దొంగ నోట్ల మూలాలు కనుగొన్నారు.
నిందితుల నుంచి సేకరించిన సమాచారంతో అనపర్తిలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి ద్వారా అసలు నిందితుడైన కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. తాను యూట్యూబ్‌లో చూసి దొంగ నోట్లను తయారు చేశానని అతడు చెప్పిన మాటలకు పోలీసులు ఆశ్చర్యపోయారు. యూట్యూబ్ చూసి చాకచక్యంగా దొంగనోట్లను అచ్చు దింపేసిన కృష్ణారెడ్డి వాటితోనే వడ్డీ వ్యాపారం చేస్తూ నోట్ల మార్పిడి చేసి భారీగా సంపాదించాడని పోలీసుల విచారణలో తేలింది.
యూట్యూబ్ లో చూసి ఒక మామూలు తెల్లటి పేపర్‌పై 200, 500 నోట్లను రెండు వైపులా అంటించి ముద్రించడం, ఎటువంటి తేడాలు లేకుండా కట్ చేయడం, శుభలేఖల పేపర్‌పై నిజమైన నోట్ల మాదిరిగా వాటిని ముద్రించడాన్ని స్వయంగా చూసిన పోలీసులు షాకయ్యారు. తాను వడ్డీకి తిప్పే నగదు కట్లలో ఐదు దొంగ నోట్లు ఉంచి నోట్ల మార్పిడి చేసేవాడినని నిందితుడు పోలీసులకు వివరించాడు.
ఇలా దొంగ నోట్ల ద్వారా ఇప్పటివరకు సుమారు రెండు కోట్లు వెనకేసి ఉంటాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. దొంగ నోట్లు ముద్రించే కృష్ణారెడ్డితో పాటు అతనికి సహకరించిన అనపర్తికి చెందిన దొరబాబును ఇబ్రహీంపట్నంకు చెందిన నలుగురు యువకులను పోలీసులు బుధవారం రిమాండ్‌కు పంపారు. దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.