అమరావతి- ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి భంగపాటు కలిగింది. రాష్ట్రంలో మొన్న జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల పోలింగ్‌కు 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న నిబంధన రాష్ట్ర ఎన్నికల సంఘం పాటించలేదని హైకోర్టు పేర్కొంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిందని విచారణలో తేల్చింది. పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు కోడ్ విధించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య హైకోర్టును ఆశ్రయించారు.
ఆయనతో పాటు జనసేన, బీజేపీ నేతలు సైతం ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్లపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి, ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ ఏప్రిల్ 6న మధ్యంతర ఆదేశాలిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ ను ఆశ్రయించింది. ప్రభఉత్వ పిటీషన్ పై విచారించిన డివిజన్ బెంచ్ పరిషత్ ఎననికలకు అనుమతించింది. ఐతే పోలింగ్ తరువాత ఓట్ల లెక్కింపును చేపట్టవద్దని ఆదేశించింది. పోలింగ్ తరువాత ఇరుపక్షాల తరుఫున హైకోర్టులోతిరిగి విచారణ జరిగింది. ఈ క్రమంలో హైకోర్టు తాజాగా ఎన్నికలను రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చంది. ఐతే ఇప్పటికే ఎన్నికలు నిర్వహించామని, కౌంటింగ్‌కు అనుమతించాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లేయోచనలో ఉంది.