అమరావతి- రాజకీయ నాయకులు, సినీమా స్టార్స్, ప్రముఖులు అప్పుడప్పుడు కాస్త తడబడుతుంటారు. ఇక సెలబ్రెటీలు ఏం మాట్లాడినా దానిపై అందరి దృష్టి ఉంటుంది. సరిగ్గా మాట్లాడితే పరవా లేదు. కానీ ఏ మాత్రం తడబడినా ఇక అంతే సంగతులు. గతంలో ఐతే ఏమో గానీ.. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక కొంచెం తేడా వచ్చినా వెంటనే అది వైరల్ అయిపోతుంది. ఇదిగో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో ఇదే జరిగింది.
ఏపీ సీఎం జగన్ ఈ రోజు మంగళవారం దిశ యాప్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. గొల్లపూడిలో జరిగిన దిశ యాప్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కొంత తడబాటుకు గురయ్యారు. దిశ యాప్ గురించి మహిళలకు వివరించే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. మహిళ ఫోన్ లో దిశ యాప్ ఉంటే ఆ మహిళకు ఓ అన్న తోడున్నట్లేనని సీఎం చెప్పారు. ప్రతి మహిళ తప్పనిసరిగా దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని జగన్ సూచించారు. దిశ యాప్ పై పోలీసులు, అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇంత వరకు బాగానే ఉన్నా దిశ యాప్ గురించి మాట్లాడుతున్న సందర్బంగా సీఎం వైఎస్ జగన్ కాస్త తడబడ్డారు. దిశ యాప్ గురించి చెబుతున్న క్రమంలో.. ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే.. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఓ మహిళ కాబట్టి.. అని అన్నారు. వెంటనే పక్కనే ఉన్న హోంమంత్రి మేకతోటి సుచరిత కల్పించుకుని.. హోమ్ మినిస్టర్.. అని గుర్తు చేశారు. అప్పుడు తేరుకున్న సీఎం జగన్.. హోమ్ మినిస్టర్ అంటూ తనదైన శైలిలో నవ్వారు. ఇప్పుడు జగన్ తడబాటుగా అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.