ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికల గొడవ జరుగుతోంది. ‘మా’ ప్యానెల్ పదవీకాలం ముగియడంతో త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్దమవుతోంది. ఈ క్రమంలో చాలా మంది ‘మా’ అధ్యక్ష్య పదవికోసం పోటీ పడుతున్నారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్ వంటి వారు పోటీకి సై అంటున్నారు. ఈ నేపధ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఇక ప్రకాష్ రాజ్ విషయంలో ఐతే నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు కొందరు. ‘మా’ ఎన్నికలలో అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్న నటి హేమ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌పై ఆరోపణలు గుప్పించింది. ఇక మెగాస్టార్ చిరంజీవితో సహా 100కి పైగా ‘మా’ సభ్యులు వెంటనే ఎన్నికలు జరపించాలని కోరుతూ డీఆర్‌సీ ఛైర్మన్ కృష్ణంరాజుకు లేఖలు రాశారు. ఇదిగో ఇటువంటి సమయంలో ప్రకాష్ రాజు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
‘జెండా ఎగరేస్తాం’ అంటూ ప్రకాష్ రాజ్ ఓ ట్వీట్ చేశారు. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేశారా, లేక ‘మా’ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి జెండా ఎగరేస్తాం అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారా అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. మొత్తానికి ప్రకాష్ రాజ్ జెండా ఎగరేస్తాం అన్న ట్వీట్ మాత్రం తెలుగు సినీ పరిశ్రమ వర్గాల్లో చర్చ నీయాంశమవుతోంది.
మరి ప్రకాష్ రాజ్ ఏ ఉద్దేశ్యంతో ఈ ట్వీట్ పెట్టారన్నది ఆయన స్పందిస్తేగాని క్లారిటీ రాదని కొంతమంది ‘మా’ సభ్యులు కామెంట్ చేస్తున్నారు. మొన్ననే ప్రమాదం కారణంగా కాలికి ఆపరేషన్ చేయించుకున్న ప్రకాష్ రాజు, కోలుకుని ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు. బయటకు వచ్చీ రాగానే ఇలా ట్వీట్ పెట్టి అలా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు ప్రకాష్ రాజ్.
“జెండా” ఎగరేస్తాం ……
— Prakash Raj (@prakashraaj) August 14, 2021