ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ నుంచి మొదలుపెడితే హాలీవుడ్ వరకు ఆయనకు చాలా మంది అభిమానులున్నారు. సహజ నటనకు పెట్టింది పేరుగా అమీర్ ఖాన్ ను అభివర్ణిస్తారు. మరి అలాంటి అమీర్ ఖాన్ మరొకరికి అభిమాని అంటే ఆశామాషీ వ్యవహారం కాదు. అది కూడా మన టాలీవుడ్ హీరోయిన్ కావడం విశేషం. ఎవరా అదృష్టవంతురాలు అని అనుకుంటున్నారా..
అమీర్ ఖాన్ అభిమానం సంపాదించింది మరెవరో కాదు. అందాల భామ సాయి పల్లవి. అవును సాయిపల్లవికి అమీర్ ఖాన్ అభిమాని అయిపోయారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. సాయి పల్లవి సినిమాలు చూడకపోయినా కూడా ఆమె డ్యాన్సులను చూసి అభిమానిగా మారాడట అమీర్ ఖాన్. ఈ విషయాన్ని ఆమిర్ ఖాన్ లవ్ స్టోరీ ఈవెంట్లో చెప్పారు.
సాయి పల్లవిని ఏదో పాటలో యూట్యూబ్లో చూశానని చెప్పిన ఆయన, ఆమె సినిమాలు ఇంత వరకు చూడలేదని అన్నారు. అందుకు తనను క్షమించాలని అన్న అమీర్ ఖాన్, తాను సాయి పల్లవి మొదటి క్లిప్ చూసిన వెంటనే ఫిదా అయిపోయానని, వెంటనే ఆమెకు ఫ్యాన్ అయిపోయానని చెప్పుకొచ్చారు. ఈ రోజు ఇక్కడ సాయి పల్లవిని కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉందన్న అమీర్, లవ్ స్తోరీ సినిమా హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు అమీర్ ఖాన్.
అన్నట్లు ఈనెల 24న ఈ సినిమా విడుదల కాబోతోంది. తాను కూడా లవ్ స్టోరీ మూవీ చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నానని చెప్పిన అమీర్ ఖాన్, అదే రోజున థియేటర్లో చూస్తానని, మహారాష్ట్రలో అనుమతి లేకపోతే ఒక్క స్క్రీన్ కోసం పర్మిషన్ తీసుకుని అయినా చూస్తానని అన్నారు. ఇక ఈరోజు ఈవెంట్ ఉందని తెలిసి, నేనే వస్తాను అని నాగచైతన్యను అడిగి మరీ వచ్చానని చెప్పారు అమీర్ ఖాన్.