స్పెషల్ డెస్క్- మారుతున్న కాలంతో పాటు ఆడవాళ్లు పురుషులతో పోలిస్తే వారు దేంట్లోను తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. మగాళ్లతో సరిసమానంగా పనిచేయడమే కాదు.. అంతరిక్షంలోకి సైతం వెళ్తున్నారు ఆడవాళ్లు. ఒక విధంగా చెప్పాలంటే మగాళ్ల కంటే ఆడవాళ్లే కాస్త ఒపికగా పనిచేస్తారని చాలా అధ్యయనాల్లో తేలింది. అందుకే ప్రపంచంలో చాలా సంస్థలు కీలకమైన పదవుల్లో మహిళలనే నియమిస్తున్నాయి. వారికి ఏ పని అప్పగించినా వంద శాతం న్యాయం చేస్తారనే నమ్మకమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ఐతే ఆడవాళ్లు ఎంత చదివినా, మగాళ్లతో సమానంగా ఉద్యోగం చేసినా.. ఇంకా వంటింటి నుంచి మాత్రం విముక్తి లభించడం లేదు. భర్తతో సమానంగా ఉద్యోగానికి వెళ్లి వచ్చిన భార్య.. ఇంటికి రాగానే మళ్లీ వంట చేయాల్సిందే. ఇది మాత్రం మారడం లేదు.
మిగతా సమయంలో ఐతే పరవా లేదు.. కానీ కరోనా సోకినా, మహిళలకు వంటింటి పాట్లు మాత్రం తప్పడం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఫోటోనే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ ఫోటోను చూస్తే తప్పకుండా మీ గుండె బరువెక్కుతుంది. ఓ మహిళ ఆక్సిజన్ పెట్టుకుని మరీ కిచెన్‌లో వంట చేస్తున్న ఈ ఫోటో.. మన దేశంలో మహిళలు ఎదుర్కొంటున్నదుస్థితికి నిలువటద్దంగా కనిపిస్తోంది. ఈ పోటోలో ఓ మహిళ ఆక్సీజన్ పైపు పెట్టుకుని కిచెన్ లో వంట చేస్తోంది. ఆమె చాలా నీరసంగా కనిపిస్తోంది. కరోనా సోకి ఆక్సీజన్ లెవల్స్ తగ్గినప్పుడే వైద్యులు ఆక్సీజన్ పెట్టుకోవాలని సూచిస్తారు.
దీన్ని బట్టి ఈ మహిళకు కరోనా సోకగా ఆక్సీజన్ పైపుతోనే వంట చేస్తోందని అర్ధమవుతోంది. ఇలా కిచెన్ లో ఆక్సీజన్ పెట్టుకుని వంట చేయడం ప్రమాదకరమని చెబుతున్నారు. కనీసం ఆమెకు కిచెన్ లో సాయం చేసేందుకు కూడా ఎవరు లేరు. మరి ఆమె తన కోసం వంట చేసుకుంటుందా.. లేక ఇంట్లో వాళ్ల కోసమా అన్నది కూడా తెలియదు. కరోనా సోకిన ఆమె.. తన కోసం వంట చేసుకోవాలన్నా కూడా ఎంత కష్టమో చెప్పాల్సిన పని లేదు. మన దేశంలో ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు జీవిస్తుండటం దురదృష్టకరమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.