ప్రతి పిల్లవాడికి తనకంటూ వ్యక్తిగత అభిరుచులు, ఆలోచనలు ఉంటాయి. తల్లిదండ్రులు.. తమ బిడ్డలను సరైన మార్గంలో వెళ్లే విధంగా సలహాలు సూచనలు చేయాలి. అంతే కానీ తమ అభిప్రాయాలను, కలల్ని పిల్లలపై రుద్దకూడదు. వారి ఇష్టాయిష్టాలను గౌరవించాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క పేరెంట్ కి తెలియజేయాలనుకున్నాడు 15 ఏళ్ల తెలుగు బాలుడు ఆశిష్. 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్ చదువుతున్న ఆశిష్.. చెన్నై నుంచి లద్దాఖ్ రాజధాని లేహ్ వరకు సైకిల్ పై సాహసయాత్ర చేశాడు. మరి..ఆశిష్ కి ఆలోచన ఎందుకు వచ్చింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆశిష్ స్వగ్రామం కడప జిల్లా రాజంపేట. అయితే వ్యాపారరీత్య కొన్నేళ్ల కిందట ఆశిష్ కుటుంబం చెన్నైలో స్థిరపడింది. అతడికి చిన్నతనం నుంచి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. తన పరిసరాల్లో నిత్యం సైకిల్ చేస్తుండే వాడు. ఓ రోజు ఆశిష్ ఇంటికి సమీపంలో తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్ చదువుతున్న ఓ బాలిక ఇంట్లో నుంచి పారిపోయింది. ఇది ఆశిష్ మనస్సులో ఆలోచన కలిగించింది. ఇంత చిన్న వయస్సులో ఇంట్లో నుంచి పారిపోవడానికి కారణం ఏమిటి? అని ఆలోచించాడు. చివరికి తల్లిదండ్రులు తమ ఆలోచనలను, కోరికలను పిల్లలపై రుద్దడం వలనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గుర్తించాడు. తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లలపై రుద్దకుండా, పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలి అనే నినాదంతో ఆశిష్ చెన్నై నుంచి లద్దాఖ్ రాజధాని లేహ్ వరకు సైకిల్ మీద సాహసయాత్ర చేశాడు.
జూలైలో చెన్నై నుంచి సైకిల్‌పై బయలుదేరి ఆశిష్.. 41 రోజుల్లోనే లేహ్‌కు చేరుకున్నాడు. యాత్ర పూర్తి చేసుకున్న ఆశిష్ ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడ ఆశిష్ తో సహా అతడి కుటుంబ సభ్యులు ఏపీ భవన్ లో మీడియాలోత మాట్లాడారు. ఈ సైకిల్ యాత్ర గురించి పలు విషయాలను వెల్లడించారు. ఆశిష్ మాట్లాడుతూ..సైకిల్ యాత్రలో భాగంగా మైదాన ప్రాంతంలో రోజూ 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించానని, చండీఘడ్ నుంచి పర్వత ప్రాంత ప్రయాణం మొదలయ్యాక ప్రతికూల వాతావరణం, వర్షం కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడినా యాత్రను కొనసాగించినట్లు తెలిపాడు.
తన తల్లిదండ్రులెప్పుడూ తనపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని, వారి అభిప్రాయాలను తనపై రుద్దలేదని ఆశిష్ తెలిపాడు. మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాలన్నదే తన కల అని ఆశిష్ పేర్కొన్నాడు. భవిష్యత్తులో చెన్నై నుంచి లండన్‌కు సైకిల్‌యాత్ర చేయనున్నట్లు ఆశిష్ చెప్పాడు.