ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే రంగుల, హంగుల ప్రపంచం. ఈ సినీ నీలాకాశంలో తారలా ఓ వెలుగు వెలగాలని ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది ఇండస్ట్రీకి వస్తారు. అవకాశాలు లేక జూనియర్ ఆర్టిస్టులుగా సర్దుకుపోతారు. అయితే ఈ ఇండస్ట్రీలో మహిళా ఆర్టిస్టులని వేధించే పదం క్యాస్టింగ్ కౌచ్. అవకాశాలు రావాలంటే సమర్పించుకోవాల్సిందే అని కొంతమంది వేధిస్తుంటారు. ఇష్టం లేని వారు అవకాశాలని వదులుకుంటారు. అయితే ఇష్టం లేని వారిని కూడా లోబరుచుకునే అస్త్రం ప్రేమ. ప్రేమ పేరుతో ఆర్టిస్టులని ట్రాప్ చేసి శారీరక వాంఛ తీర్చుకుని వదిలేస్తారు. తాజాగా ఒక యువ హీరో జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రేమ పేరుతో మోసగించాడు. ఆమెను పలుమార్లు ఆఫీస్ కి పిలిచి ఆమెపై లైంగిక దాడి చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఒక రిసార్ట్ కి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. యామినీ భాస్కర్ హీరోయిన్ గా నటించిన “కొత్తగా మా ప్రయాణం” సినిమాలో హీరోగా నటించిన ప్రియాంత్ రావుకి జూనియర్ ఆర్టిస్ట్ తో పరిచయం ఏర్పడింది. పరిచయమైన రెండు నెలల తర్వాత ఆమెకు ప్రపోజ్ చేయగా.. ఆమె ప్రేమని అంగీకరించింది. అలా ప్రేమలో మునిగి తేలుతున్న క్రమంలో హీరో.. ఒకరోజు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న ప్రగతి రిసార్ట్ కి తీసుకెళ్లి.. పెళ్లి చేసుకుంటా అని నమ్మించి అత్యాచారం చేశాడని జూనియర్ ఆర్టిస్ట్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అంతేకాకుండా శ్రీనగర్ కాలనీలో ఉన్న మూవీ ఆఫీస్ కి తీసుకెళ్లి పలుమార్లు తనను లైంగికంగా వేధించాడని ఆమె వెల్లడించింది. తనకు గర్భం దాల్చడంతో ప్రియాంత్ రావు హ్యాండ్ ఇచ్చాడని, అబార్షన్ కోసం మెడిసిన్స్ ఇవ్వడంతో అనారోగ్య సమస్యలు వచ్చాయని ఆమె వాపోయింది. ఈ విషయం బయటకు చెప్తే తనను చంపేస్తా అని హీరో విలన్ లా బెదిరించాడని ఆమె తెలిపింది. యువ హీరో ప్రియాంత్ రావుపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.