ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా? చూస్తుంటే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది మాష్టారు అని అనాలనిపిస్తుంది కదూ. పాత స్కూటర్ మీద ఓ కుర్రాడు, ఆ వెనక ఓకే కుర్రాడు.. పక్కన ఇద్దరు కుర్రాళ్ళు. వీరిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా కనబడుతున్న ఆ కుర్రాడు ఇప్పుడొక సెన్సేషనల్ డైరెక్టర్. ఎప్పటికైనా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలాలిరా అన్నట్టు ఫ్రెండ్స్ తో చర్చిస్తున్నట్టు ఆ ఫోజు చూశారా? నిజంగానే అప్పుడు ఏం చర్చించుకున్నారో తెలియదు గానీ ఈరోజు మాత్రం ఆయన భారతీయ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న రారాజు అయిపోయారు. సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. మీమర్స్, ట్రోలర్స్ సెలబ్రిటీల చైల్డ్ హుడ్ ఫోటోలను షేర్ చేసి గుర్తు చేస్తుంటారు. తాజాగా ఈ ఫోటో కూడా ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో బాగా చక్కెర్లు కొడుతోంది.
ఎవరు సినిమా కథ చెప్తే నిర్మాతలు తడి గుడ్డలు వేసుకుని హ్యాపీగా నిద్రపోతారో, ఎవరి పేరు చెప్తే డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు పండగ చేసుకుంటారో, ఎవరు సినిమా తీస్తే ఆ హీరోలు తిరుగులేదని ఫీలవుతారో, ఎవరి పేరు చెబితే ప్రేక్షకులు పండగ చేసుకుంటారో, ఎవరి పేరు చెబితే బాక్సాఫీస్ సామ్రాజ్యం ఊపిరి పీల్చుకుంటుందో, ఎవరి పేరు చెబితే పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయో, ఎవరు పేరు చెబితే రికార్డుల మోత మోగుతుందో అతనే అపజయమెరుగని ఎస్.ఎస్. రాజమౌళి. స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో డైరెక్టర్ గా అడుగుపెట్టి.. సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి 1, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ ఇలా ప్రతీ సినిమాతో ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు.
టాలీవుడ్ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న రాజమౌళి.. ఇప్పుడు మహేష్ బాబుతో గ్లోబ్ ట్రోటింగ్ నేపథ్యంలో భారీ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. తన సినిమాలను నెలలు, ఏళ్ల పాటు అద్భుతంగా చెక్కుతారు కాబట్టి రాజమౌళికి జక్కన్న అనే పేరు కూడా ఉంది. ఆ పేరు పెట్టింది ఎవరో కాదు, రాజీవ్ కనకాలనే. ఇక అక్టోబర్ 10న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ఫోటో నెట్టింట సందడి చేస్తోంది. ఆయన పుట్టినరోజు అంటే ఆయనకొక్కరికే కాదు, ఫ్యాన్స్ అందరికీ కూడా పండగే. ఒక దర్శకుడికి హీరోల స్థాయిలో ఫ్యాన్స్ ఉండడం అనేది బహుశా రాజమౌళికే సాధ్యమైంది.