దెబ్బకి థింకింగ్ మారాలంటూ.. ఏ ముహుర్తాన బాలయ్య నోటి నుంచి ఈ డైలాగ్ వచ్చిందో తెలియదు కానీ.. దేశంలోని అన్ని షోలను తలదన్నే రేటింగ్స్‌తో రికార్డులు క్రియేట్ చేసింది అన్‌స్టాపబుల్ షో. సీజన్ 1 సాధించిన భారీ విజయంతో.. సీజన్ 2 ని గ్రాండ్‌గా స్టార్ట్ చేయనున్నారు ఆహా టీం. సీజన్ 1ని మించేలా ఈ సారి సీజన్ 2కి ఎవరూ ఊహించని గెస్ట్‌లు రాబోతున్నారని తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. సీజన్ 2 తొలి ఎపిసోడ్ కోసమే.. ఏకంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చారు. ఈ ఎపిసోడ్ అక్టోబర్ 14న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఇప్పటికే ఈ ప్రోమో మిలియన్ల వ్యూస్ సంపాదించింది.
ఇక ప్రోమోలో తొలుత చంద్రబాబు నాయుడు వచ్చారు. ఇద్దరి మధ్య రాజకీయాలు, పర్సనల్ విషయాలు ఇలా పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఇక ప్రోమో చివర్లో నారా లోకేష్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా బాలకృష్ణ.. అల్లుడు లోకేష్‌కి రాజకీయాలు, పర్సనల్ విషయాల గురించి ప్రశ్నలు సంధించాడు . ఈ క్రమంలో మంగళగిరిలో ఓడిపోవడం గురించి అల్లుడిని ప్రశ్నించాడు బాలయ్య. ‘మంగళగిరి.. ప్రజా ప్రతినిధుల సభకు వెళ్లాలనే మొదటి అడుగు.. ఓడిపోయావ్.. ఎందుకు? అని బాలయ్య అడగడంతో.. ‘సంకల్పంతో ఆనాడు వెళ్లాను’ అంటూ తన ఓటమికి గల కారణాలు వివరించారు లోకేష్ బాబు.
ఆ తరువాత చిన్నప్పుడు లోకేష్ ఎలా ఉండేవాడో చెప్పుకొచ్చాడు బాలకృష్ణ. లోకేష్.. చిన్నప్పుడు.. ఏది పడితే అది పట్టుకుని అది నాది నాది అనేవాడు.. అప్పుడు నేను.. ఏంట్రా నీది.. మూటకట్టేసి బయటపడేస్తా అని బెదిరించేవాడిని అంటూ ఆనాటి సరదా విషయాలను గుర్తు చేయడంతో లోకేష్ తెగ నవ్వుకున్నాడు. అలా నాది నాది అంటూ తన కుమార్తె బ్రహ్మణిని సొంతం చేసుకున్నాడు అంటూ ఛలోక్తోలు విసిరాడు బాలయ్య. అనంతరం లోకేష్ ప్రైవేట్ ఫోటో ఒకటి చూపించి అల్లుడిని ఆటపట్టించాడు బాలయ్య.
ఇక లోకేష్.. ఫారిన్‌లో విదేశీ భామలతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోని చూపించిన బాలయ్య.. ‘ఈ ఫొటో అసెంబ్లీ వరకూ వెళ్లింది.. ఈ ఫొటోపై మీ స్పందన ఏంటి బావా.. అని పక్కన ఉన్న చంద్రబాబుని అడిగాడు. అందుకు చంద్రబాబు.. ‘మామకి లేని సందేహం నాకెందుకు’ అంటూ సమాధానం చెప్పాడు. ఇక ఆ తర్వాత లోకేష్ హోస్ట్ స్థానంలోకి వెళ్లి.. తండ్రి, మావలను ప్రశ్నలు అడిగాడు. ఈ సందర్భంగా లోకేష్.. ‘మీ ఇద్దరిలో వంట ఎవరు బాగా చేస్తారు’ అని లోకేష్ అడగ్గా.. ‘నేను సలహాలు ఇస్తాను’ అని అన్న బాలయ్య.. ఆ వెంటనే చంద్రబాబుని ఉద్దేశించి.. ‘బావా.. మా చెల్లికి ఒక్కసారి కూడా వండిపెట్టలేదా?’ అని అడిగాడు. అందుకు.. ‘నేనే వండుకోలేదు.. ఆవిడకు ఏం వండిపెడతాను’ అని సమాధానం చెప్పాడు చంద్రబాబు.
ఇక ఇద్దరిలో భార్య మాట ఎవరు ఎక్కువగా వింటారు అని లోకేష్ అడగ్గా.. ‘పబ్లిక్‌లో ఒప్పుకోవడానికి నా ఇగో ఒప్పుకోవడం లేదు’ అని అన్న బాలయ్య.. తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి నా కాపురంలో నిప్పులు పోస్తున్నారా అని చంద్రబాబు పంచ్ వేశాడు. మొత్తానికి ఈ ప్రోమోనే మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతుంది. ఇక పూర్తి ఎపిసోడ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు అంటున్నారు.