పుష్ప సినిమాలో హీరో.. పోలీసులకి చిక్కకుండా ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తుంటాడు. అది సినిమా కాబట్టి దొరక్కుండా మేనేజ్ చేశాడు. మధ్యమధ్యలో హీరో హీరోయిజం ప్రదర్శించాడు. కానీ నిజ జీవితంలో పుష్పలా చేద్దామంటే ఫైర్ కాదు.. పోలీసుల చేతుల్లో పుష్పం అయిపోతారు. పుష్ప సినిమా చూసి చాలా మంది ప్రభావితమై అక్రమ రవాణాకి పాల్పడి పోలీసుల చేతులకి చిక్కారు. అయితే పుష్ప కంటే ముందుగానే.. రియల్ లైఫ్ లో ప్రముఖ రైటర్ కోన వెంకట్ అక్రమంగా గంజాయిని గోవా తరలించారట. అది కూడా ఫ్రెండ్ షిప్ కోసమట. సాధారణంగా ఫ్రెండ్ కోసం డాబు డబ్బు సాయం చేస్తారు. లేదంటే ఇంకేదైనా సాయం చేస్తారు. కానీ కోన వెంకట్ ఏకంగా ఫ్రెండ్ కోసం రిస్క్ చేయడానికి కూడా వెనుకాడలేదు. అది కూడా ఒక పోలీస్ కొడుకు అయి ఉండి ఈ రిస్క్ చేశారు. మరి ఫ్రెండ్ కోసం ఎందుకు చేయవలసి వచ్చింది? ఫ్రెండ్ కి అంత కష్టం ఏమొచ్చింది?
పేరు చెప్పలేదు కానీ ఒక కాలేజ్ ఫ్రెండ్ ఉన్నాడట. అతను ఆదిలాబాద్ నిర్మల్ అడవిని ఆనుకుని ఉంటాడట. అప్పుల పాలవ్వడం వల్ల.. జీవితంలో అన్నీ కోల్పోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందట. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే గంజాయి పండించి.. ఆ గంజాయిని గోవాలో అమ్మడమే మార్గమని అనుకున్నాడట. ఆ డబ్బుతో తన సమస్యలన్నీ తీరిపోతాయని 5 ఎకరాల్లోనో, 10 ఎకరాల్లోనో గంజాయి పంట వేశాడట. కూలీలను పెట్టించి 100 కిలోల గంజాయిని కోయించాడట. మొత్తం గంజాయి ప్యాక్ చేసి గోవా బయలుదేరాడట. అయితే దారిలో పోలీసులకు దొరికేశాడట. ఆ సమయంలో పోలీసులు డబ్బు డిమాండ్ చేయడంతో.. డబ్బులు లేక సరుకు పోలీసుల దగ్గర వదిలేసాడట.
డబ్బులు లేక ఇక తన చాప్టర్ క్లోజ్ అని భావించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడట. చావు బతుకుల్లో ఉన్నప్పుడు హాస్పిటల్ లో ఉన్న విషయం తెలిసి.. కోన వెంకట్ హాస్పిటల్ కి వెళ్లి విషయం తెలుసుకున్నారట. దానికి అతని ఫ్రెండ్ జరిగింది చెప్పాడట. ‘డబ్బులివ్వకపోతే ఆ పోలీసోడు సరుకుని కోర్టుకి అప్పజెప్పేస్తాడు. డిసెంబర్ నెల.. గోవాలో బాగా డిమాండ్ ఉంటుంది. ఈ మిస్ అయితే మళ్ళీ అవకాశం రాదని, ఇక తనకి చావే పరిష్కారం’ అని చెప్పడంతో కోన వెంకట్ సాయం చేయాలని అనుకున్నారట. అనుకున్నదే తడవుగా పోలీసోడికి ఇవ్వాల్సిన డబ్బు పోగుజేసి అతనికి ఇచ్చి సరుకు బయటకి తెచ్చారట. అక్కడి నుంచి గోవాకి వెళ్లి అమ్మేయాలని బయలుదేరారట.
కోన వెంకట్ తండ్రి డీఎస్పీ అట. ఆయన కారులోనే స్నేహితులతో కలిసి సరుకు అమ్మేందుకు బయలుదేరారట. మహబూబ్ నగర్, కర్ణాటక, గోవా ఇలా 3 చెక్ పోస్టులు పగడ్బందీగా దాటించి మరీ సరుకు అమ్మారట. అలా తన ఫ్రెండ్ ని సేవ్ చేశానని, ఫ్రెండ్ కోసం మాత్రమే చేశానని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. నిజ జీవితంలో జరిగిన కథనే సినిమాగా తీస్తానని కూడా ప్రకటించారు. నలుగురు స్నేహితులు కారులో గోవా వెళ్లి సరుకు ఎలా అమ్మారు అనే కథాంశంతో సినిమాని తెరకెక్కిస్తున్నట్లు కోన వెంకట్ వెల్లడించారు. మరి కష్టాల్లో ఉన్న ఫ్రెండ్ కోసం కోన వెంకట్ గంజాయి అక్రమ రవాణా చేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.