‘‘బ్రహ్మాస్త్రం’’ గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరిది. రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా తెరకెక్కిన సినిమాగా ఈ పేరు ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందింది. ఇక, బ్రహ్మాస్త్రం సినిమా మొత్తం అస్త్రాల మీద తెరకెక్కింది. అస్త్రం అంటే ఆయుధం అని అర్థం వస్తుంది. పూర్వపు రోజుల్లో ముఖ్యంగా పురాణాల్లో శత్రువులను చంపటానికి అస్త్రాలను ఉపయోగించేవారు. పురాణాల్లో చాలా రకాల అస్త్రాలు పేరు గాంచాయి. వాటిలో అత్యంత శక్తివంతమైన అస్త్రంగా పేరొందినదే ఈ ‘‘బ్రహ్మాస్త్రం’’. ఈ అస్త్రాన్ని బ్రహ్మ సృష్టించాడు కాబట్టి బ్రహ్మాస్త్రం అన్న పేరు వచ్చింది. సత్యం, ధర్మం గాడి తప్పినప్పుడు, అధర్మాత్ముల వల్ల ధర్మానికి ఆపద కలిగినప్పుడు వారిని శిక్షించడానికి సృష్టించబడిందే ఈ ‘‘బ్రహ్మాస్త్రం’’..
హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మాస్త్రం అత్యంత శక్తివంతమైన అస్త్రం. సమస్త సృష్టిని నాశనం చేయగల శక్తి, సమస్త జీవులను జయించగల శక్తి ఈ బ్రహ్మాస్త్రానికి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న సో కాల్డ్ న్యూక్లియర్ బాంబులు, ఇంకేవో అణుబాంబులు అవన్నీ దీని ముందు జుజుబీలు. ఒకసారి ఈ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే దాన్ని ఏ శక్తి, ఏ వ్యక్తి ఆపలేరు. దీన్ని బ్రహ్మ సృష్టించిన మరో రెండు అస్త్రాలైన బ్రహ్మ శీర్ష అస్త్రం, బ్రహ్మానంద అస్త్రాలే ఆపగలవు. ఇప్పుడున్న బాంబులు ఎవరు ప్రయోగించినా పని చేస్తాయి. కానీ ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేవారికి అర్హత ఉండాలి. అస్త్రాన్ని ప్రయోగించే నియమాలు తెలిసినవారై ఉండాలి. తెలియకుండా ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రం పని చేయకపోగా.. తిరిగి అది ప్రయోగించిన వారినే నాశనం చేస్తుంది. రోజులో ఒకసారి మాత్రమే ఇది పని చేస్తుంది. ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసాక లక్ష్యాన్ని చేరుకుని శత్రువుని లేదా శత్రు సైన్యాన్ని అంతమొందించడంలో అపజయమెరుగదు ఈ బ్రహ్మాస్త్రం. అలాంటి శక్తివంతమైన ఈ అస్త్రాన్ని చరిత్రలో అతి కొద్ది మంది మాత్రమే వాడారు.
రామాయణంలో బ్రహ్మాస్త్రం ఆయుధాన్ని శ్రీరాముడు పలుమార్లు ప్రయోగించిన సందర్భాలు ఉన్నాయి. సీతని బాధించిన జయంత మీద, సీతను అపహరించేందుకు బంగారు లేడీ వేషం ధరించిన మారీచుడి మీద, రావణాసురిడి మీద బ్రహ్మాస్త్రం రామునిచే ప్రయోగించబడింది. రామాయణం ప్రకారం ఓ సారి రాముడు తన బ్రహ్మాస్త్రాన్ని సముద్రుడి మీద ఉపయోగిస్తాడు. అది కూడా సముద్రంలో దారి ఏర్పాటు చేసుకుని లంకను చేరుకోవటం కోసం. అయితే, ఈ సమయంలోనే సముద్రుడు పైకి వచ్చి రాముడ్ని శరణు వేడతాడు. బ్రహ్మాస్త్రం సంధిస్తే సముద్రం నాశనం అవుతుంది. జీవులన్నీ చనిపోతాయని ప్రార్థిస్తాడు. దారికోసం తాను సహాయం చేస్తానని చెబుతాడు. రాముడు సరేనంటాడు. కానీ, ఇక్కడ గుర్తుంచుకోవల్సిన పాయింట్ ఏంటంటే.. ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టిన తర్వాత ఉపసంహారం చాలా కష్టం. అందుకే దాన్ని ద్రూమతుల్య అనే ప్రదేశంలోకి వదులుతాడు. ఆ ప్రదేశమే ఇప్పటి రాజస్తాన్. బ్రహ్మాస్త్ర కారణంగానే అది ఎడారిగా మారిందని పురాణం.
మహాభారతంలోనూ బ్రహ్మాస్త్రంను ఉపయోగించారు. అయితే, అతి కొద్దిమంది మాత్రమే బ్రహ్మాస్త్రాన్ని వాడారు.
మహాభారత యుద్దంలో ధర్మరాజును చంపటానికి ద్రోణుడు అన్ని విధాల ప్రయత్నించాడు. కానీ, వల్ల కాలేదు. అలాంటి సమయంలో ఆయన తన బ్రహ్మాస్త్రాన్ని ధర్మరాజు మీదకు ప్రయోగించాడు. అప్పుడు ధర్మరాజు తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రంతో దాన్ని అడ్డుకున్నాడు.
సంశప్తకులను చంపటానికి అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు. ఈ అస్త్రం కారణంగా వారందరూ మరణించారు. మహాభారతంలో వీరే కాకుండా.. ద్రుష్టదుమ్నుడు, అశ్వద్ధాముడు, కర్ణుడు, భీష్ముడు కూడా బ్రహ్మాస్త్రాన్ని వాడారు.
ఒక వంద కోట్ల కేజీల బరువుతో చేయబడిన న్యూక్లియర్ బాంబుకి 100 చదరపు మైళ్ళ ప్రాంతాన్ని అంతం చేయగల సామర్థ్యం ఉంటుందని అంచనా. అలాంటిది అనంతమైన ఈ సృష్టిని అంతం చేయాలంటే ఎన్ని న్యూక్లియర్ బాంబులు కావాలో అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని లెక్క. బ్రహ్మాస్త్రానికి సరితూగే అస్త్రాన్ని గానీ అణుబాంబుని గానీ తయారుచేయడం మనిషికి సాధ్యం కాని పని. బ్రహ్మాస్త్రం ఒకసారి ప్రయోగిస్తే ప్రపంచం మొత్తం ఆల్ క్లియర్ అవ్వాల్సిందే. అలాంటి బ్రహ్మాస్త్రం ముందు న్యూక్లియర్ బాంబులు డాండ్రఫ్ క్లియర్ షాంపూ ప్యాకెట్లతో సమానం.
మహాభారతం, రామాయణ కాలంలో బ్రహ్మాస్త్రం లాంటి ప్రమాదకరమైన ఆయుధాలను వాడారనటానికి కొన్ని శాస్త్రీయ ఆధారాలు కూడా లభించాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత అయిన మొహంజోదారోలో కొన్ని ఆధారాలు లభించాయి. శాస్త్రవేత్తలు అక్కడ పరిశోధనలు జరపగా.. అత్యంత శక్తివంతమైన బాంబు కారణంగా నగరంలోని కొంత భాగం నాశనం అయినట్లు వారు తేల్చారు. అయితే.. అది ఖచ్చితంగా బ్రహ్మస్త్రమే అని చెప్పలేము. ఏదేమైనా.. నిన్న మొన్నటి వరకు సంప్రదాయం, దేవుడు, ధర్మం అన్న మాటలకి దూరంగా సినిమాలు చేసిన బాలీవుడ్.. ఇప్పుడు ఇంతటి గొప్ప అస్త్రం చుట్టూ ఓ భారీ సినిమాని చేయడం నిజంగా శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. ఇంతటి గొప్ప ఘనమైన చరిత్ర కలిగిన మనం గర్వించాలి. మరి ప్రపంచం గర్వించే భారతదేశ పురాణాల్లో భాగమైన బ్రహ్మాస్త్రంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.