ఓ స్టార్ హీరో.. మాస్ బీజీఎం.. అలా స్క్రీన్ పై నడిచొస్తుంటే ఫ్యాన్స్ అస్సలు కంట్రోల్ లో ఉండరు. విజిల్స్ వేసి గోలగోల చేస్తారు. ఇంకా ఎక్కువైతే కుర్చీలు, బల్లలు లాంటివి విరిగిపోతాయి. ఇక ఇద్దరు స్టార్ హీరోలు స్క్రీన్ పై కలిసి నటిస్తే.. ఆ మజానే వేరు. అలాంటిది ఏకంగా స్టార్ హీరోలందరూ ఒకేసారి స్క్రీన్ పై కనిపిస్తే రచ్చ గ్యారంటీ. వాళ్లకు తోడు హీరోయిన్లు కనిపించారంటే అంతే సంగతులు.. ఎప్పుడు ఏ సినిమా కోసం అని ఎగ్జైట్ అయిపోవద్దు. ఇంతకీ ఏ సినిమా కోసం హీరోలందరూ కలిశారు?
ఇక వివరాల్లోకి వెళ్తే.. నటీనటులు ఎప్పుడూ కూడా మంచి రిలేషన్స్ మెంటైన్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఈ విషయం బయటకి తెలిసేది కాదు. దీంతో అభిమానులు ఒకరితో ఒకరు గొడవపడేవారు. ఈ మధ్య కాలంలో ఓ హీరో సినిమాలో మరో హీరో నటించడం, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి వస్తున్నారు. దానికి తోడు గత కొన్నేళ్ల నుంచి మల్టీస్టారర్ ట్రెండ్ కూడా బాగా పెరిగిపోయింది. మన భాష వరకు మాత్రమే కాకుండా హిందీ నటీనటులు.. మన సినిమాల్లో తళుక్కన మెరుస్తున్నారు. తాజాగా వచ్చిన ‘గాడ్ ఫాదర్’ అందుకు ఉదాహరణ. చిరు హీరోగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించి వావ్ అనిపించారు.
ఇదంతా పక్కనబెడితే దాదాపు 35 ఏళ్ల క్రితమే అతిపెద్ద మల్టీస్టారర్ తీశారు. కాకపోతే ఇది సినిమా అంతా కాదు. ఓ పాట వరకు మాత్రమే పరిమితం చేశారు. అసలు విషయానికొస్తే.. 1987లో ‘త్రిమూర్తులు’ సినిమా వచ్చింది. వెంకటేశ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ‘ఒకే మాట ఒకే బాట’ పాటలో అప్పటి హీరోలు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తదితరులు కనిపించారు. వీళ్లతోపాటు అప్పటి స్టార్ హీరోయిన్స్ విజయశాంతి, రాధిక, రాధ, విజయనిర్మల, భానుప్రియ, సుమలత తదితరులు వచ్చారు. మురళీమోహన్, చంద్రమోహన్, జయమాలిని, శారద లాంటి యాక్టర్స్ కూడా తళుక్కున మెరిసి ఫ్యాన్స్ కి కనువిందు చేశారు. వెంకటేశ్ తండ్రి, నిర్మాత రామానాయుడు చెప్పడం వల్లే ఈ స్టార్స్ అందరూ కూడా ఈ పాటలో నటించడానికి అంగీకరించారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మల్టీస్టారర్స్ అని చెప్పుకుంటున్న వాటి కంటే ఈ పాట ఎప్పుడో రికార్డ్స్ బ్రేక్ చేసిందనమాట. మరి ఈ క్రేజీ మల్టీస్టారర్ గీతంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.