మూడున్నర దశాబ్దాలుగా తెలుగు చిత్ర సీమలో కథానాయకులుగా రాణిస్తున్న అతికొద్ది మందిలో విక్టరీ వెంకటేశ్ ఒకరు. ప్రస్తుతం సినిమాల రేసులో తన కాంటెంపరరీస్ చిరంజీవి, బాలయ్య, నాగార్జున కంటే మిన్నగా జెట్ స్పీడులో దూసుకుపోతున్నాడు వెంకీ. ప్రస్తుతం ‘నారప్ప’, ‘దృశ్యం-2’ లను విడుదలకు ముస్తాబు చేసిన వెంకటేశ్.. ‘ఎఫ్-3’ చిత్రాన్ని సెట్స్ పై ఉంచాడు.
ఇక.. వెంకటేశ్ సినిమాకి దర్శకుడిగా పనిచేయకపోయినప్పటికీ.. 20 ఏళ్ల క్రితమే వెంకీ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మళ్లీశ్వరి’ చిత్రాలకు కథ, మాటలు అందించి.. తనదైన మార్క్ చూపించాడు త్రివిక్రమ్. ఆ తరువాత నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలని వెంకటేశ్ ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. కానీ.., త్రివిక్రమ్ మరో ఎండ్ లో టాప్ డైరెక్టర్ కావడం, వెంకటేశ్ కూడా బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో వీరి కాంబో సెట్ కాకుండా వచ్చింది. అయితే.., ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ రాబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ తరహాలోనే వెంకటేశ్ కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేశాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. మహేశ్ బాబుతో సినిమా అయిపోయిన వెంటనే త్రివిక్రమ్.. వెంకటేశ్ తో సినిమా తెరకెక్కించే అవకాశాలున్నాయట. అయితే.., ఇది మల్టీ స్టారర్ మూవీనా, లేక వెంకీ ఒక్కడే సోలో ట్రీట్ ఇవ్వబోతున్నాడా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. మరి.., ఈ విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.