సూపర్ స్టార్ మహేశ్ బాబు.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో స్టార్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. మహేశ్‌కు ఒక టాలీవుడ్ హీరోగా, కృష్ణ కుమారిడిగా కంటే ఒక సామాన్యుడిగా, చిన్న పిల్లల ప్రాణాలు కాపాడే గొప్పవ్యక్తిగా అభిమానులు ఎక్కువ ఉన్నారు. మహేశ్ బాబు ఇప్పటికే చాలా మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ వాళ్ల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాడు. ఒకవైపు తన తండ్రి కృష్ణ మృతి చెందిన సమయంలో కూడా మరో కుటుంబంలో వెలుగులు నింపేందుకు చిన్నారికి శస్త్ర చికిత్స చేయించారు. నటనతోనే కాకుండా వ్యక్తిత్వం, సేవాగుణంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేశ్ బాబుతో ఉన్న ఓ బుడ్డాడి పిక్ బాగా వైరల్ అవుతోంది.
అయితే ఆ పిక్‌లో ఉన్నది ఎవరో తెలియని వాళ్లు అయితే అవంత వైరల్ అయ్యేది కాదు. ఆ పిక్‌లో ఉన్న బుడ్డాడు ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ క్రేజీ హీరో కూడా. అంతేకాకుండా ఓ సీనియర్ హీరో- హీరోయిన్ కుమారుడు. అవును.. ఆ పిల్లాడు హీరో శ్రీకాంత్- సీనియర్ నటి ఊహల పెద్దబ్బాయి రోషన్. టాలీవుడ్‌లో ఇప్పటికే ఉన్న పోటీని తట్టుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. యంగ్ హీరోగా నిర్మలా కాన్వెంట్ సినిమాతో ఓ స్కూల్ పిల్లాడి పాత్రలో కనిపించి మెప్పించాడు. నటన పరంగా తనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ కథకు తగ్గ వయసులో ఉన్నాడు కాబట్టి శ్రీకాంత్ కూడా ఆ మూవీతో డెబ్యూ చేయించారు. కానీ, తర్వాత కొంతకాలం రోషన్ టాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు.
ఇటీవలే దర్శకేందుడు రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరీ రోనంకి దర్శకత్వంలో పెళ్లిసందD సినిమా చేశాడు. ఈ సినిమాలో రోషన్ సరసన శ్రీలీల తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీతో అటు రోషన్‌కి, ఇటు శ్రీలీలకు మంచి గుర్తింపు లభించింది. యాక్టింగ్, డాన్స్, కామెడీ టైమింగ్ ఇలా అన్నింట రోషన్‌కు మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తర్వాత శ్రీలీలకు మంచి అవకాశాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం శ్రీలీల చేతిలో 2 ప్రాజెక్టులు ఉన్నాయి. రవితేజతో కలిసి ధమాకా చిత్రంలో నటిస్తోంది. రోషన్ కూడా ప్రొడక్షన్ నంబర్ 9 అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. ప్రియాంక్ దత్ దానికి ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ప్రదీప్ అద్వైతం రచించి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇంక శ్రీకాంత్ కుటుంబం విషయానికి వస్తే.. ఇటీవలే వారికి సంబంధించిన ఒక పుకారు వైరల్ అవడం చూశాం. 25 ఏళ్ల తర్వాత శ్రీకాంత్- ఊహ విడాకులు తీసుకుంటున్నారు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిపై శ్రీకాంత్ తీవ్రంగా స్పందించారు. అసలు ఈ వార్తలు ఎక్కడి నుంచి పుట్టిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు సంబధించి ఓ ఓపెన్ లెటర్ కూడా రాశారు. ఈ పుకార్లు చూసి బంధువులు ఫోన్ చేసి మాట్లాడుతుంటే చాలా ఇబ్బందిగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి పుకార్లు పుట్టించే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను డిమాండ్ చేశారు. అలాంటి పుకార్లను నమ్మకండి అంటూ శ్రీకాంత్ ఫ్యాన్స్‌ను కోరారు.